Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు తక్షణమే చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) డిమాండ్ చేసింది. ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారంహైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు జంగయ్య, రవీందర్, హరికృష్ణ, శ్రీనునాయక్, మక్సూద్, శారద ధర్నాలో మాట్లాడారు. ఏడేండ్లుగా ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ చేపట్టకపోవడంతో అనేకమంది తమ సర్వీస్‌లలో ఒక్క పదోన్నతి కూడా లేకుండా రిటైరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సీఎం ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖ మంత్రి ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపినప్పటికీ షెడ్యూల్ విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. 317జీవో అప్పీళ్లను పరిష్కరించాలనీ, ప్రాథమిక పాఠశాల హెచ్ఎమ్ పోస్టులను మంజూరు చేయాలన్నారు. ఈహెచ్ఎస్ కోసం 2 శాతం చందా మినహాయింపు విషయంలో ముందుకు వెళ్ళకూడదని కోరారు. తక్షణమే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రారభించకపొతే ఈ నెల 31వ తేదీన ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్యామ్ సుందర్, సింహాచలం, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్, టీటీఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ రాథోడ్, నవనీత, ఇతర జిల్లా, మండల బాధ్యులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీఆర్వో సూర్యలతకు వినతిపత్రం అందజేశారు.