Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిద్ర మత్తులో బోడుప్పల్ కార్పొరేషన్ అధికారగణం
- వరుస ఘటనలతో భయాందోళనలో కాలనీలవాసులు!
బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులపై దాడి చేసి గాయపరచడంతో వివిధ కాలనీల ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ దేవేందర్ నగర్ కాలనీలో నివాసం ఉండే మేడే సురేష్ కుమార్తె శ్రేయాసనా (4) గురువారం నాడు ఇంటి ముందు అడుకుంటుండగా వీధి కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచాయి. ఇలాంటి సంఘటనే వారం రోజుల క్రితం ఎంఎల్ఆర్ కాలనీలో జరిగింది. వరుసగా వీధి కుక్కలు చిన్నారులపై దాడి చేసి గాయపరుస్తుండడంతో వివిధ కాలనీల ప్రజలు బేంబేలెత్తున్నారు.
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కలను అరికట్ట డానికి గాను ఏడాది క్రితమే కార్పొరేషన్ కౌన్సిల్ తీర్మానం చేసి కొంత బడ్జెట్‌ను కేటాయించారు. అంతే కాకుండా యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) సెంటర్ ఏర్పాటు చేసి కుక్కలకు సంతానోత్పత్తి కాకుండా చర్యలు తీసుకున్నారు. కానీ నగరంలో కుక్కల బెడద మాత్రం తప్పడం లేదు. అనేక కాలనీలో కుక్కల దాడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించి గాయాలపాలైన వారు ఇంకా అనేకమంది ఉన్నారు. ఇంకా వెలుగులోకి రాని సంఘటనలు అనేకం ఉన్నాయని ప్రజలు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిద్ర మత్తును వీడి వీధి కుక్కలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటారా లేదా అలాగే అలసత్వం వహిస్తారా చూడాలి.
డెడ్‌బాడీని పీక్కుతిన్న కుక్కలు
నగరంలోని కుల్సుంపుర పీఎస్ పరిధిలో పన్నెండేళ్ల బాలుడి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతి చెందిన బాలుడు స్థానికంగా నివాసముంటున్న సయ్యద్ కుమారుడు సోఫియాన్‌గా గుర్తించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దించారు. బాలుడిని ఎవరో హత్య చేసి మూసీనదిలో పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.