Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
విద్యార్థులు సెల్ఫోన్లతో వస్తే.. అవి స్వాధీనం చేసుకోవడమే కాకుండా వారిని పరీక్షలకు అనుమతించేది లేదని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. టెన్త్, ఇంటర్ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలపై గురువారం ఆయన సంబంధిత శాఖ అధికారులతో వారి చాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షా కేంద్రాలలోకి విద్యార్థులు ఎవరు సెల్ఫోన్లతో రావొద్దని.. వచ్చినవారిని సెంటర్లకు అనుమతించమన్నారు. ఈనెల 31 నుంచి జూన్ 18 వరకు టాస్ ఒపెన్ టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. పరీక్షలను పకడ్భందిగా నిర్వహించాలన్నారు. అన్ని కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనీ, ఎలాంటి మాస్ కాపీంగ్ జరగకుండా విద్యార్థులను తనిఖీ చేయాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన తాగునీరు , ఒఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రతి సెంటర్ వద్ద ఒక ఏఎన్ఎం ఉంచాలని తెలిపారు. జిల్లాలో మొత్తం ఒపెన్ పది పరీక్షలకు 56 కేంద్రాలు, ఇంటర్‌కు 37 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. టెన్త్ పరీక్షలకు 10,617, ఇంటర్‌కు 8,124 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నట్టు వివరించారు. ఆర్టీసీ బస్సులు తగినన్ని నడపాలనీ, విద్యుత్తుకు అంతరాయం లేకుండా చూడాలని అధి కారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహించే రోజుల్లో 144 సెక్షన్‌తోపాటు , జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారిణి ఆర్.రోహిణి, జిల్లా కో-ఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ నర్సింగ్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.