Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు భూపాల్
నవతెలంగాణ-బంజారాహిల్స్
కార్మికులకు కష్టాలు వస్తే పట్టించుకునే నాథుడు కరువయ్యారని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు భూపాల్ అన్నారు. కనీస వేతనాలు అమలుచేయాలని కోరుతూ శుక్రవారం పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి ఆవరణలో తాత్కాలిక ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా భూపాల్ మాట్లాడుతూ నిమ్స్‌లో ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే మరిఎవరు పట్టించుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు. సంబంధిత మంత్రులకు ఆస్పత్రి డైరెక్టర్‌కు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం శూన్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, గ్యాస్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని, ఇటువంటి పరిస్థితుల్లో చాలీచాలని జీతాలతో కార్మికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మికులకు వేతనాలు అమలుచేయాలని, సీనియార్టీ ప్రకారం పర్మినెంట్ చేయాలని, రిటైర్మెంట్ అయిన వారికి వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో నిరసన మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో నిమ్స్ సీఐటీయూ ప్రెసిడెంట్ ఈశ్వరరావు, జనరల్ సెక్రెటరీ బాలయ్య, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.