Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే పనులను నిలిపివేయాలి
- సీపీఐ(ఎం) నగర కమిటీ డిమాండ్
- రాంనగర్, బాగ్‌లింగంపల్లి స్టీల్ బ్రిడ్జి నిర్మాణ బాధితుల కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-ముషీరాబాద్
ట్రాఫిక్ సమస్యల్లేని ప్రాంతంలో స్టీల్ బ్రిడ్జి నిర్మించే అవసరం ఏమొచ్చిందని, ప్రజల ఆస్తులకు తీవ్ర నష్టం కలిగించే రాంనగర్, బాగ్ లింగంపల్లి స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎం) నగర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్డంతో బాధితులుగా మారిన కుటుంబాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో నగర కార్యదర్శివర్గ సభ్యులు దశరథ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. రాంనగర్ బాగ్ లింగంపల్లి మధ్య నిర్మించే సెకండ్ లెవెల్ స్టీల్ బ్రిడ్జి మొదటి దశలో వీఎస్టీ చౌరస్తా నుంచి క్రికెట్ అకాడమీ వరకు నిర్ణయించిన డిజైన్‌ను మార్చడంవల్ల స్థానికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఎస్టీ చౌరస్తా నుంచి ఆర్టీసీ కల్యాణ మండపం ఎదురుగా అంబేద్కర్ కాలేజీ వరకు మరోప్లాన్ అమలు చేస్తుండటంతో రెండు కంపెనీల స్థలాలు ఎంఐసీ కాలనీలో నివాసముండే 20 కుటుంబాలు వీధినపడే ప్రమాదం ఉందన్నారు. డిజైన్ మార్చడంవల్ల బడ్జెట్ పెరిగి ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని చెప్పారు. ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేని ప్రాంతంలో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం అవసరమా? అని ప్రశ్నించారు. స్టీల్ బ్రిడ్జ్ బాధిత 60 కుటుంబాలకు న్యాయం జరిగే వరకు సీపీఐ(ఎం) అండగా ఉంటుందన్నారు. అనంతరం స్టీల్ బ్రిడ్జి నిర్మాణ బాధితుల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా శ్రీనివాస్, కార్యదర్శిగా నాగరాజు, అడ్వైజర్లుగా శంభుప్రసాద్, పురుషోత్తం రెడ్డితో పాటు మరో 15 మందితో కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జోన్ కార్యదర్శివర్గ సభ్యులు జయరాములు, శ్రీరాములు, కమిటీ సభ్యులు కె. రమేశ్, భాష సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.