Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెలలో మూడో ఘటన
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. ఈ నెలలో ఇప్పటికే మూడు కాలనీల్లో చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరచగా ఆదివారం నాడు కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్ వాసవినగర్లో ఇంటి ముందు నడుచుకుంటూ వెళుతున్న ఓ విద్యార్థినిపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ కార్పొరేషన్ వాసవి నగర్లో నివాసం ఉంటున్న టీ.శ్రీనివాస్ కుమార్తె యశశ్విని (16) ఆదివారం నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు నడుచుకుంటూ వెళుతుండగా వీధి కుక్కలు మీదకు ఎగపడి దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు చికిత్స కోసం ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు.
నివారణ చర్యలు ఉండేనా?
బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ కాలనీల్లో వీధి కుక్కలు రెచ్చిపోతు దాడులు చేస్తున్నాయి. వీధి కుక్కల దాడులతో ప్రజలు బయటకు రావాలంటేనే భయాందోళనకు గురౌతూన్నారు.
ఈ నెల రోజుల వ్యవధిలో నాలుగు చోట్ల వీధి కుక్కల దాడులు జరిగాయి అయినా కూడా అధికారులలో ఎలాంటి చలనం లేకుండాపోయింది. ఇప్పటికైనా వీధికుక్కలను నియంత్రించడానికి అధికారులు కషి చేస్తారా లేదా అలసత్వం వహిస్తారా? అంటూ బోడుప్పల్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.