Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏ పద్మ, కె.నాగలక్ష్మి
- జాంబవి నగర్లో మహిళలతో కలిసి ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
ముషీరాబాద్ జాంబవి నగర్లోని రోడ్లు, డ్రయినేజీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఐద్వా హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏ పద్మ, కె.నాగలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జాంబవి నగర్లో ఐద్వా ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు సరైన రోడ్లు లేక నిత్యం ప్రవహిస్తున్న డ్రయినేజీతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మురుగు నీరు ఇండ్లలోకి వస్తుండడంతో తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని చెప్పారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసిన ప్రజా ప్రతినిధులు ప్రజల తీవ్ర సమస్యలను పట్టించుకొనే పరిస్థితిలో లేరని మండిపడ్డారు. బస్తీలో సరైన రోడ్లు డ్రయినేజీ ఇబ్బందులతో వృద్ధులు, బడికి వెళ్లే పిల్లలు ఆందరూ నడవలేకపోతున్నారని వాపోయారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. పేద ప్రజల సమస్యలు తీర్చడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. అధికారులు ఇదే వైఖరితో ఉంటే ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తారన్నారు. సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం చేస్తామన్నారు. అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి జాంబవి నగర్లోని డ్రయినేజీ, రోడ్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు. అధికారులు స్పందించక పోతే ఆందోళన ఉధృతం చేస్తామని సీఐటీయూ నాయకులు శ్రీరాములు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రవళిక, సంతోషి, వసుంధర, సునీత, శారద, అనిత తదితర బస్తీ నాయకులు పాల్గొన్నారు.