Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
- దోమలగూడలో డ్రయినేజ్ పైప్‌లైన్ పనులు ప్రారంభం
నవతెలంగాణ-అడిక్‌మెట్
ముషీరాబాద్ నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన డ్రయినేజీ పైప్లైన్లు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం కవాడిగూడ డివిజన్ దోమలగూడ శివ ప్యాలెస్ వద్ద రూ.46 లక్షలతో సీవరేజ్ డ్రయినేజ్ పైప్‌లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ రచనశ్రీతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో వరద నీరు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా శిథిలావస్థలో ఉన్న డ్రయినేజీ పైప్‌లైన్స్ స్థానాల్లో కొత్తవి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ముషీరాబాద్‌లో డ్రయినేజీ సమస్య తీవ్రంగా ఉండటంతో తేలికపాటి వర్షానికి నాలా పొంగి ప్రవహిస్తూ వరద నీరు రోడ్లపైకి వస్తుందని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి అత్యధిక నిధులతో నాలా విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు. త్వరలోనే పనులు పూర్తిచేసి ఒక్క వర్షపు నీటి బొట్టు కూడా రోడ్లపై నిలువకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యువ నాయకులు ముఠా జై సింహ, డివిజన్ ప్రెసిడెంట్ వల్లాల శ్యామ్ యాదవ్, కార్యదర్శి సాయి కష్ణ, వల్లాల శ్రీనివాస్ యాదవ్, రామ్ చందర్, కల్వ గోపి, రాజశేఖర్ గౌడ్, శ్రీహరి, ప్రభాకర్, పాస్‌పోర్ట్ శ్రీనివాస్, ముచ్చకుర్తి ప్రభాకర్, శ్రీకాంత్, సుధాకర్ యాదవ్, కరిగక కిరణ్, మధుకర్, జలమండలి అధికారులు డీజీఎం చంద్రశేఖర్, ఏఈ శ్రీధర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.