Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీఎస్యూ , పీవైఎల్
- నేడు ప్రగతి భవన్ ముట్టడి
నవతెలంగాణ-అడిక్మెట్
అరకొర ఉద్యోగ నోటిఫికేషన్లతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి మహేష్ అన్నారు. నిరుద్యోగ, విద్యార్థి సమస్యల పరిష్కారానికి పీడీఎస్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో సోమవారం జరిగే ప్రగతి భవన్ ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం విద్యానగర్లోని మార్క్స్ భవన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు భారీ ఉద్యోగాలతో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల దరఖాస్తు ఫీజులను రద్దు చేయాలని, అప్లికేషన్లోతప్పులను సవరించుకోవడానికి ఎడిట్ ఆప్షన్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. వేలాది రూపాయలు దండుకుంటున్న ప్రయివేట్ కోచింగ్ సెంటర్లు మౌలిక సదుపాయాలను కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. అనుమతులు లేకుండా, విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తున్న ప్రయివేట్ కోచింగ్ సెంటర్ లను రద్దు చేయాలని, ప్రభుత్వమే ఉచితంగా కోచింగ్ వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే రిలీజ్ చేయాలని అన్నారు. విద్యార్థి, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం శ్యామ్, ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు రాకేష్, వికాస్, సాయి, రాజేష్, గోవర్ధన్, శ్రీను పాల్గొన్నారు.