Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో/ఓయూ
సమాజంలో పేరుకుపోయిన అసమానతలు, దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ సీజీఎం మహ్మద్ అబ్దుల్ ఖాదర్ అని అన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అబ్దుల్ ఖాదర్ హాజరై భాగ్యరెడ్డివర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాగ్యరెడ్డివర్మ బాలికా విద్య కోసం ఆనాడే పరితపించిన మహానీయుడన్నారు. సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ఆయన రచయితగా, పాత్రికేయుడిగానూ పోరాడారని కొనియాడారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఓయూ పరిపాలనా భవన్లో భాగ్యరెడ్డి వర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్. రిజిస్ట్రార్ ప్రొ. పి.లక్ష్మీనారాయణ, యూజీసీ డీన్ ప్రొ మల్లేశం, ఓయూ ఎస్సీ, ఎస్టీ సెల్ డెరైక్టర్ ప్రొ. బి.మంగు నాయక్, డా.అజీమ్ ఉన్నిసా, మాజీ లైబ్రరీయన్ డా.పవన్ కుమార్ పాల్గొన్నారు.
ఓయూలోని తన క్వార్టర్స్‌లో భాగ్యరెడ్డి వర్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మెన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. కార్యక్రమంలో దక్షిణ భారత పరిశోధక జేఏసీ నాయకులు దుర్గం శివ, శ్రీనివాస్, వెంకటయ్య పాల్గొన్నారు.