Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్టీపీల నిర్మాణ పనులపై వాటర్ బోర్డు ఎండీ సమీక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో
సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ) నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశించారు. హైదరాబాద్ మహానగరంలో ఉత్పత్తి అయ్యే మురుగు నీటిని వంద శాతం శుద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,866.21 కోట్ల వ్యయంతో 31 కొత్త సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ)ను జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఆయన అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్కువ సామర్థ్యంతో నిర్మిస్తున్న అంబర్‌పేట, నాగోల్, నల్లచెరువు, ఫతేనగర్ ఎస్టీపీల నిర్మాణ పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ... వర్షాకాలంలో సివిల్ పనులకు ఆటంకం కలుగుతుంది కాబట్టి ఇప్పుడే వీలైనంత ఎక్కువ సివిల్ పనులు పూర్తి చేయాలని, ఇందుకు తగ్గట్టుగా పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఎస్టీపీలకు అవసరమైన ఎలక్ట్రోమెకానికల్ ఈక్విప్మెంట్కు వెంటనే ఆర్డర్ చేయాలని నిర్మాణ సంస్థలను ఆదేశించారు. ఈ ఏడాది చివరి కల్లా ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో వేగంగా పనులు జరపాలని సూచించారు. నిర్మాణంలో ఒక్కో దశ పూర్తి చేయడానికి ఒక్కో తేదీని లక్ష్యంగా నిర్దేశించుకొని, ఆ తేదీలోగా పూర్తి చేసేలా ప్రణాళికబద్ధంగా పనులు చేయాలని సూచించారు. ఎస్టీపీలు నిర్మిస్తున్న ప్రాంగణాల్లో బ్యూటిఫికేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, పచ్చదనాన్ని పెంపొందించాలని పేర్కొన్నారు. పనులు జరుగుతున్న ప్రదేశాల్లో కార్మికులు, సిబ్బంది రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కచ్చితంగా వారు రక్షణ పరికరాలను వినియోగించేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఈడీ డా.ఎం.సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, ఎస్టీపీ సీజీఎంలు, జీఎంలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.