Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలేజీ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవుల్లో విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్న డీడీ కాలనీలోని శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి సమాఖ్య(ఎస్ఎఫ్ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె.అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్ బోర్డు మే 20 నుంచి జూన్ 14 వరకు విద్యార్థులకు అధికారికంగా సెలవులు ప్రకటించిందని, డీడీ కాలనీ శ్రీచైతన్య కళాశాల యాజమాన్యం మాత్రం ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తూ.. వారిని ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులు నిర్వహించడమేగాక రాని వారిని ప్రాక్టికల్స్‌లో మార్కులు తగ్గిస్తామని భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డు అధికారులు తక్షణమే స్పందించి డీడీ కాలనీ శ్రీచైతన్య కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో అంబర్‌పేట జోన్ అధ్యక్ష కార్యదర్శులు వేమన, నాగేందర్, ఏసుదాసు, అనిల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.