Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టర్లపై మండిపడ్డ జంట కార్పొరేషన్ల మేయర్లు
నవతెలంగాణ-బోడుప్పల్
జంట మున్సిపల్ కార్పొరేషన్ల పరిధి ప్రజలకు వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ఎస్ఎన్డీపీ ద్వారా నిర్మించే స్ట్రామ్ వాటర్ డ్రయినేజీ నిర్మాణంలో కాంట్రాక్టర్లు జాప్యం చేయడం తగదని, పద్ధతి మార్చుకోవాలని జంట కార్పొరేషన్ల మేయర్లు మండి పడ్డారు. మంగళవారం పీర్జాదిగూడ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్లు జక్క వెంకట్ రెడ్డి, సామల బుచ్చిరెడ్డిలు మాట్లాడుతూ... రెండేండ్ల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా జంట కార్పొరేషన్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితులను నివారించడానికి రాష్ట్ర మంత్రులు చామకూర మల్లారెడ్డి, కేటీఆర్‌ల సహకారంతో ఎస్ఎన్డీపీ ద్వారా రూ.110 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. ఇందులో భాగంగా స్ట్రామ్ వాటర్ డ్రయిన్ నిర్మాణానికి టెండర్ దక్కించుకున్న గుత్తేదారులు ఇప్పటికే పనులు ప్రారంభించినా వివిధ కారణాలతో పనుల్లో జాప్యం చేస్తుండటంపట్ల కాంట్రాక్టర్‌పై అసహనం వ్యక్తం చేశారు. చెంగిచర్ల చింతల చెరువు నుండి, బోడుప్పల్ అల్మాస్ కుంట నుండి, పీర్జాదిగూడ చెరువు, పర్వతాపూర్ చెరువు నుండి మూసీకి అనుసంధానించే విధంగా ఇలా నాలుగు మార్గాలలో పనులు ప్రారంభించి, నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్‌గౌడ్, బోడుప్పల్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, మున్సిపల్ కమిషనర్ డా. పి. రామకృష్ణ రావు, ఎస్ఎన్డీపీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.