Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జగన్
నవతెలంగాణ-తుర్కయంజాల్
పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలనీ, పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్స్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జగన్ డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తుర్క యంజాల్ జోన్ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం తుర్క యంజాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతుందన్నారు. రాష్ట్రంలో పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మొటిక్ చార్జీలు పెంచడం లేదన్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నా గురుకులాలు, ఇతర సంక్షేమ హాస్టళ్లలలో చదువుతున్న విద్యార్థులకు మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచడం లేదన్నారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.1500 ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడేండ్లుగా రూ. 3727.22 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్స్, స్కాలర్షిప్స్ పెండీంగ్లో ఉన్నాయనీ, వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తుర్కయంజాల్ కేంద్రంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కార్పొరేట్, ప్రయివేట్ విద్యా సంస్థల్లో ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకోవాలనీ, ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక పర్యవేక్షణ అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ కార్యదర్శులు డి.కిషన్, ఎం.ప్రకాశ్ కారత్, అబ్దుల్లా పూర్ మెట్టు మండల అధ్యక్ష, కార్యదర్శులు కే.లోకేశ్, గుండె శివకుమార్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం తుర్కయంజాల్ జోన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎం.పథ్వీరాజ్, కార్యదర్శిగా: ఎం.స్టాలిన్, ఉపాధ్యక్షులుగా కే.అకిల్, బి.అభితేజ్, కే.రాహుల్, సహాయ కార్యదర్శులుగా కే.గణేష్, ఇ.సంతోష్, ఇ.సందీప్తోపాటు మరో 12మందితో నూతన కమిటీ ఎన్నికైంది.