Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఖైరతాబాద్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా సీపీఐ(ఎం) జోన్ కార్యదర్శి గోపాస్ కిరణ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద, మధ్య తరగతి సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను పూర్తిగా నశింపజేస్తున్నాయన్నారు. ఇష్టానుసారంగా ధరలు పెంచేసి పేదల అభివద్ధిని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలు యజమానుల ఆస్తులను పెంచి పోషిస్తూ నిరుద్యోగ నిరుపేద భారతదేశంగా మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో జోన్ నాయకులు పి.శ్రీనివాస్, పి.పుల్లారావు, ఎన్ కొండల్ రావు, కే రాము, సురేష్, ఎం వెంకటేష్, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.