Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ ఈ. తిరుమలి
నవతెలంగాణ-హైదరాబాద్
సంచార జాతులకు అన్ని రంగాల్లో 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రొఫెసర్ ఈ.తిరుమలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ప్రొఫెసర్ ఈ.తిరుమలి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పొరేషన్‌కు చైర్మెన్‌గా సంచార జాతులకు చెందిన వారినే నియమించాలని డిమాండ్ చేశారు. సంచార జాతులకు ఉన్న నాలుగు ఫెడరేషన్లకు పాలక వర్గాన్ని నియమించడంతో పాటు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఆత్మగౌరవ భవనాలకు కేటాయించిన స్థలాల్లో నిర్మాణం చేపట్టాలని, గురుకులాల్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని, నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని, బీసీ 'ఏ'లో చేర్చిన 13 సంచార జాతుల కులాలకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. సంచార జాతుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూన్ 26న ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంటెద్దు నరేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పిపిరిశెట్టి శ్రీనివాస్, అధికార ప్రతినిధి వెన్నెల నాగరాజు, వైస్ చైర్మెన్ కొల్లప్పు సమ్మయ్య, కర్నె శివకుమార్, చెన్నయ్య, యువరాజు, వేణు, యాదగిరి, వివిధ జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.