Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాలార్జంగ్ మ్యూజియం సందర్శనలో మాజీ ఎంపీ వి.హనుమంత రావు
నవతెలంగాణ-ధూల్‌పేట్
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సాలార్జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాల్లో దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధాకరమని పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీ వి.హనుమంత రావు ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఆయన మ్యూజియం సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన ఫొటోలను పరిశీలించారు. మ్యూజియంలో నెహ్రు చిత్రపటాన్ని చిన్నగా అతికించడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. దేశం కోసం స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని పోరాడిన, ప్రాణ త్యాగం చేసిన గోపాల కష్ణ గోఖలే, భగత్ సింగ్, అరబిందో లాంటి మహనీయుల చిత్రపటాలను చిన్నవిగా పెట్టి, జైల్లో ఉండి బ్రిటిష్ వారిని క్షమాభిక్ష కోరిన వినాయక్ దామోదర్ సావర్కర్ చిత్రపటాన్ని పెద్దగా పెట్టడం దేశ ప్రజలను, స్వాతంత్ర సమరయోధులను అవమానపరచడమే అన్నారు. మహాత్మా గాంధీ, నెహ్రు, సర్దార్ పటేల్ వంటి మహానీయుల ఫొటోలను వారం రోజుల సమయంలో ఏర్పాటు చేయాలని, లేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఆందోళన చేస్తామన్నారు. అనంతరం మ్యూజియం క్యురేటర్, ఇన్చార్జీ కుసుమ్‌కి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎస్.పి.క్రాంతి కుమార్, ఎస్.శ్రీకాంత్ గౌడ్, ఈ.ప్రభాకర్, పి.రామ్మోహన్, జి.నవీన్ కుమార్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.