Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి.నరసింహ
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
వినాశకరమైన విధానాలతో విధ్వంసాలు, దౌర్జన్యాలు, గందరగోళం, అరాచకలు సష్టిస్తూ దేశ ఆస్తులను అమ్మి కార్పొరేట్లకు దోచిపెట్టడం తప్ప ఎనిమిదేండ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు చేసిందేమీలేదని సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి. నరసింహ విమర్శించారు. సోమవారం హిమాయత్‌నగర్‌లోని పార్టీ నగర కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలపై క్రమబద్ధమైన విధ్వంసానికి మోడీ ప్రభుత్వం పాల్పడుతుందని మండిపడ్డారు. నకిలీ జాతీయవాదం పేరుతో దేశ ప్రజల ప్రయోజనాలను మోడీ తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తూ, ద్వేషపూరిత రాజకీయాలు చేయడం, తమ బీ టీం ఎంఐఎం పార్టీతో కలిసి మతం పేరుతో పట్టణాల్లో వీధి హింసలకు ప్రోత్సహిస్తూ తీరిక లేకుండా కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఆర్థిక, ఆరోగ్య, వ్యవసాయ, మానవతా సంక్షోభాన్ని నియంత్రించడంలో, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగం అరికట్టడంలో, పెరిగిన ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలను అదుపుచేయడంలో కేంద్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. అత్యంత అసమర్థ పాలన కొనసాగిస్తూ దేశ ప్రజలను ప్రధాని మోడీ నిరుద్యోగులుగా, తిండిలేని, నిస్సహాయకులుగా మార్చివేసి అచ్చేదిన్ నహి హై చచ్చే దిన్ హై అని వారి జీవితాలను అంధకారంలోకి నెట్టుతున్నారని విమర్శించారు. అజ్ఞానం, అహంకార రాజకీయ నాయకత్వం ఉన్న మోడీకి దుష్పరిపాలన చేయడం తప్ప, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ప్రజాస్వామ్య బద్దంగా పాలనా కొనసాగించలేరని ఈ ఎనిమిదేండ్ల పాలనలో రుజువైందని ఆయన తెలిపారు.