Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుబాటులోకి కైతలాపూర్ ఆర్ఓబీ,చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్‌ను సిగల్ ఫ్రీ సిటీగా తీర్చిద్దడంలో భాగంగా వ్యూహాత్మక రోడ్లు, ఫ్లై ఓవర్ల అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపడుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు(ఎస్ఆర్డీపీ) పథకం ద్వారా మొదటి దశలో చేపట్టిన పనులు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతిపాదించిన మొత్తం పనుల్లో ఇంకా మిగిలిపోయిన, అసంపూర్తిగా ఉన్న పనులన్నింటినీ ఈ సంవత్సరం డిసెంబర్ చివరి వరకు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇంకా పలు చోట్ల ప్రాధాన్యత గుర్తించిన పలు జంక్షన్ల వద్ద గాని ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు జీహెచ్ఎంసీ కార్యాచరణ సిద్ధం చేసింది.
41 పనుల్లో..
వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం ద్వారా ఇప్పటి వరకు చేపట్టిన 41 పనుల్లో 29 పనులు అందుబాటులోకి వచ్చాయి. ఎస్ఆర్డీపీ ద్వారా చేపట్టిన 41 పనులలో 29 పనులు పూర్తి కాగా ఆర్ఓబీ/ఆర్‌యూబీలు కైతలాపూర్తో కలిసి మొత్తం 7 అందుబాటులోకి వచ్చాయి. ఉత్తమ్‌నగర్, లాలాపేట్, తుకారాంగేట్, ఉప్పుగూడ లెవెల్ క్రాసింగ్, హైటెక్ సిటీ, ఆనంద్‌బాగ్ ప్రాంతాల్లో అందుబాటులోకి రావడంతో మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ కూడా జూన్‌లో అందుబాటులోకి రానున్నది. త్వరలో కైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తుంది. ఆర్ఓబీ పనులు పూర్తయిన నేపథ్యంలో జూన్‌లో ప్రారంభించనున్నారు. ఆర్ఓబీతో పాటుగా సర్వీస్ రోడ్డు, నాలా, ఫుట్‌పాత్, స్ట్రీట్ లైట్, స్టేర్ కేస్ నిర్మాణం రూ.83 కోట్ల వ్యయంతో చేపట్టారు. హైటెక్ సిటీ-బోరబండ మధ్యలో 4 లైన్ల క్యారేజీ వేను నిర్మించారు. అందులో రైల్వే శాఖ రూ.18 కోట్లు, భూసేకరణ రూ.25 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజా రవాణా మెరుగుకు ఆర్ఓబీని చేపట్టారు.
కూకట్పల్లి-హైటెక్ సిటీ మధ్యలోగల సమానంగా రోడ్డు పెట్టినందున జేఎన్టీయూ, మలేసియాసిటీ, సైబర్ టవర్స్ జంక్షన్ల వరకు ట్రాఫిక్ ప్రభావం తగ్గిస్తుంది. అంతేగాక సనత్‌నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు వెళ్లేందుకు 3.50 కిలో మీటర్లు తగ్గడమే కాకుండా ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. రైల్వే ఓవర్ బ్రిడ్జి 675.50 మీటర్ల పొడవులో 46 మీటర్లు రైల్వే స్పాట్ ఉంది. ద్విముఖ 16.61 మీటర్ల వెడల్పుతో 5.50 మీటర్ల సర్వీస్ రోడ్డు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు.