Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్, ప్రయివేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలి
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జగన్
నవతెలంగాణ-సరూర్‌నగర్
పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, కార్పొరేట్, ప్రయివేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జగన్ అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఎల్బీనగర్నగర్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం సరూర్‌నగర్‌లో జరిగింది. రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జగన్ హాజరై మాట్లాడారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతుందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వం మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. రోజు రోజుకూ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి కానీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు మెస్ బిల్లులు, కాస్మొటిక్ చార్జీలు మాత్రం పెంచడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడేండ్ల నుంచి రూ. 3727.22 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్స్, స్కాలర్ షిప్స్ పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కార్పొరేట్, ప్రయివేట్ విద్యాసంస్థల్లో ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకోవాలని, ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక పరివేక్షణ అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా నవీన్, కో- కన్వీనర్లుగా నిఖిల్, కే.మహేశ్, మరో 12 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రవీందర్, ఎం.ఉదరు, ఎన్.ప్రవీణ్, వాసు తదితరులు పాల్గొన్నారు.