Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాడాలని ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ద్రవిడ బహు జన సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కరుణానిధి 98వ జయంతి సందర్భంగా దక్షిణాది ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ.. తెలంగాణలో భూములన్నీ గుజరాత్ మార్వాడిల చేతుల్లోకి వెళ్తున్నాయని అన్నారు. దక్షిణ భారతదేశం మొత్తం ఈ చర్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నగరాలకే పరిమితమైన మార్వాడి గుజరాతి పెట్టుబడి సంస్థలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాయన్నారు. ద్రవిడ బహుజన సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, కర్ణాటక రాష్ట్ర శాఖా వ్యవస్థాపకులు అభిగౌడ్, ప్రొఫెసర్ బాల బోయిన సుదర్శన్, బహుజన రచయిత మచ్చ దేవేందర్, ఎమ్మార్పీఎస్ నాయకులు లింగస్వామి, ఓయూ విద్యార్థి నాయకులు సలీం పాషా, ముస్లిం థింకర్స్ ఫోరం నాయకులు స్కై బాబా, తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ రియాజ్, గుడిపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.