Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం
నవతెలంగాణ-ఓయూ
ఉన్నత స్థానానికి చేరాలన్న బలమైన ఆకాంక్ష, సానుకూల దక్పథం, విస్తత అధ్యయనం, లోతైన అవగాహన ఉంటే సులువుగా పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చని తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. గ్రామీణ విద్యార్థులు, పేదకుటుంబాల నుంచి వచ్చిన వారు పరిపాలనా పదవుల్లోకి రావటం వారికే గాక దేశానికి ప్రయోజనమని అభిప్రాయపడ్డారు. సివిల్ సర్వీస్, గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవు తున్న విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యూహాలు అనే అంశంపై శనివారం ఓయూ, తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీసర్కిల్తో కలిసి ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సామాన్యులను అసమాన్యులుగా తీర్చిదిద్దే క్రీడాంగణంలో చదువుతున్న విద్యార్థులు తమ మూలాలను మరవద్దని సూచించారు. పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలని, రెండు పడవలపై ప్రయాణం కాకుండా స్పష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని హితవు పలికారు. ఉస్మానియాలోని ఈ వన్ హాస్టల్లో ఉంటూ ఐఏఎస్ సాధించిన తన జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్నారు. త్వరలోనే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓయూ విద్యార్థుల కోసం బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి లైబ్రరీకి 500 సెట్ల పుస్తకాలను అందించనున్నట్లు చెప్పారు. తెలుగు అకాడమీ, ఎన్.సీ. ఈ.ఆర్.టి పుస్తకాలు చదవటం ద్వారా అభ్యర్థులకు ప్రాథమిక అవగాహన వస్తుందని వివరించారు. తాము ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం, పోటీ పరీక్షల శిక్షణ గ్రామీణ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయానికి దారేది అనే అంశంపై ప్రఖ్యాత సైకాలజిస్ట్ డాక్టర్ సి.వీరేందర్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. గ్రూప్స్ కోసం సమగ్ర ప్రణాళిక-సన్నద్ధ్దత, సామాజిక సమస్యలు అనే అంశంపై నూతనకంటి వెంకట్ మాట్లాడారు. రోల్ ఆఫ్ లాజికల్ రీజనింగ్, ఆప్టిట్యూడ్, డాటా ఇంటర్ ప్రిటేషన్ అంశంపై బండా రవిపాల్ రెడ్డి, తెలంగాణ ఉద్యమంపై పి.అశోక్ కుమార్లు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.అలోక్ కుమార్, ఓయూ ఎస్సీఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.మంగు నాయక్, ఓయూ బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు, మైనారిటీ సెల్ డైరెక్టర్ డాక్టర్ అజీము ఉన్నీసా, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.