Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జల్పల్లి మునిసిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం
- విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రజల సహకారంతో విజయవంతం అవుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మునిసిపాలిటీ పరిధి లోని 16,17,19,20 వార్డుల్లో రూ.1 కోటి 50 లక్షల నిధులతో చేపట్టబోయే బీటీ, సీసీ రోడ్ల పనులకు, వరదనీటి కాలువల నిర్మాణ పనులకు, శ్రీరామ్ కాలనీలో రూ.18 లక్షలతో నిర్మించిన వరద నీటి కాలువ నిర్మాణ పనులకు మంత్రి స్థానిక చైర్మెన్ అహ్మద్ సాది, కౌన్సిలర్లతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జల్పల్లి అంగన్వాడి కేంద్రం స్థానిక కౌన్సిలర్ బుడుమాల యాదగిరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ....స్వచ్ఛ పట్టణాలుగా మార్చటమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి నెల మునిసిపాలిటీకి రూ.36లక్షల నిధులు వస్తున్నాయన్నారు. జిల్లాలోని మొత్తం 16 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు కలిపి ప్రతి నెల రూ.2 కోట్ల 12 లక్షల నిధులు మంజూరు చేస్తున్నామని, ఇప్పటివరకు రూ.57 కోట్ల 14 లక్షల నిధులు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. కౌన్సిలర్లు తమ తమ వార్డుల్లో ఒక వాహనం, నలుగురు సిబ్బందితో చెత్తను తొలగించేలా చూడాలన్నారు. చెత్త రహిత మునిసిపాలిటీగా జల్ పల్లి మునిసిపాలిటీని తీర్చిదిద్దుదాం. పట్టణ ప్రగతి ద్వారా చేపడు తున్న కార్యక్రమాల వల్ల నేడు సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయన్నారు. మునిసిపాలిటీలో ఒక లక్ష 20 వేల మొక్కలు నాటే లక్ష్యంతో పనిచేయాలన్నారు. అన్ని వార్డుల్లో క్రీడామైదానాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని, స్థలాలు ఎంపిక చేసుకుని వెంటనే వివిధ క్రీడలకు సంబంధంచి కోర్టులు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే విద్యా సంవత్స రం నుండి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తు న్నందున, పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి నమోదు శాతాన్ని పెంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనం, పుస్తకాలు, డ్రెస్‌లు అందిస్తు న్నామని తెలిపారు. బస్తీ దవాఖానాలతో పేదల చెంతకే వైద్యం తీసుకువస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మునిసిపాలిటీ పరిధిలో పహాడి షరీఫ్, షాహీన్‌నగర్, కొత్తపేట్, జల్పల్లి, శ్రీరామ్నగర్లలో కల్పి మొత్తం 5 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డా.జీ. ప్రవీణ్ కుమార్, రీప్రజెంట్ వైస్ చైర్మెన్ యూసుఫ్ పటేల్, వైస్ చైర్మెన్ ఫర్హానానాజ్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎక్బాల్ ఖలీఫా, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, ఎండి శంషొద్దీన్, బాషమ్మ,షేక్ పమీద అఫ్జల్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ వై.జనార్దన్, సీనియర్ నాయకులు సుధాకర్‌గౌడ్, మీడియా ఇంచార్జి, మాజీ ఆర్మీమెన్ వాసుబాబు,వివిధ శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.