Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నుంచి డ్రయినేజీ పైపులైన్ ఏర్పాటు
- స్కూల్ అనుమతుల్లేకుండానే యత్నం
- గోడ, టాయిలెట్ కూల్చడానికి పర్మిషన్ లెటర్ ఇవ్వాలని హెచ్ఎం మీద ఒత్తిడి
- ఉన్నతాధికారుల పర్మిషన్ కోసం ఎదురుచూపు
నవతెలంగాణ-నేరెడ్మెట్
ప్రయివేటు పాఠశాలల్లో పిల్లలు ఎక్కువగా చదువుతున్న తరుణంలో నిరుపేదలైన సుమారు 360 మంది పిల్లలు ఆ ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు. ఈ పాఠశాల మన ఊరు మన బడికి కూడా ఎంపికైంది. ఈ ఏడాది నుంచే ఇంగ్లీషు మీడియం కూడా ప్రారంభం కానుంది. బస్టాప్‌కు కూడా దగ్గరగా ఉండటంతో పిల్లల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నది. ఈ తరుణంలో కొన్ని కాలనీలకు సంబంధించిన డ్రయినే జీని స్కూల్ కాంపౌండ్‌లో నుంచి తరళించేందుకు రాజకీయ శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. ఏనాడూ బడిని, పిల్లల బాధలను పట్టించుకోని, బడి అవసరాల గురించి ఆలోచించని స్థానిక రాజకీయ నాయకులు తమ కాసుల కక్కుర్తి కోసం అన్ని కాలనీల డ్రయినేజీని స్కూల్ ప్రహరీ గోడ లోపల నుంచి తీసుకెళ్లేందుకు పైపు లైను వేసే కుట్రలు చేస్తున్నారు. పైపు లీకేజీ అయితే పరిస్థితి ఏంటి? డ్రయినేజీ లీకైతే ఆ దర్వాసనతో పిల్లలు పాఠశాలలో ఎలా చదువుకుంటారు? అనే ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నం అవుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అల్వాల్‌లోని ఓల్డ్ అల్వాల్ జిల్లా పరిషత్ బాలుర సెకండరీ పాఠశాలలో అన్ని కాలనీల్లోని డ్రయినేజీ వెళ్లడానికి డ్రయినేజీ పైపు లైనును పాఠశాల గుమ్మం నుంచి వేయడానికి నిర్ణయించారు. జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక కార్పొరేటర్, అధికార పార్టీ నాయకులు కలిసి శనివారం పాఠశాలకు వచ్చి స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ పైపు లైను వేస్తే పిల్లలకు ఇబ్బంది అవుతుందని పాఠశాల హెడ్ మాస్టారు వారిని కోరగా.. అందులో అధికార పార్టీ నాయకుడు 'నువ్వు రెండేండ్లు పని చేసి వెళ్లిపోతావు, నీకెందుకు' అని చదువు చెప్పే గురువు అని కూడా మర్యాద లేకుండా మాట్లాడారు. ఈ పాఠశాల మన ఊరు-మన బడికి ఎంపికైంది. మరికొన్ని భవనాలు కట్టే అవకాశం ఉందది. భవిష్యత్‌లో పిల్లల శాతం పెరిగే అవకాశం లేకపోలేదు. డ్రయినేజీ పైపులు ఉంటే బిల్డింగులు కట్టుకోలేమని స్కూల్ హెడ్ మాస్టర్ వచ్చిన కార్పొరేటర్, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులకు తెలిపారు. స్కూల్ హెడ్ మాస్టారు, ఇంజినీరింగ్ అధికారులకు జరిగిన చర్చల అనంతరం ఇది వరకు చిన్న పైపు లైను ఉన్న వైపు వేయాలని నిర్ణయించారు. పక్క నుంచి వేస్తే క్రెయిన్ రాలేదని అందుకోసం గోడ, టాయిలెట్స్ కూలగొట్టాల్సి వస్తుందనీ, కూల్చడానికి పర్మిషన్ ఇస్తున్నట్టు లెటర్ కావాలని హెచ్ఎమ్ను అధికార బృందం కోరింది. తమ పై అధికారుల అనుమతి లేకుండా తాను లెటర్ ఇవ్వలేనని హెచ్ఎం చెప్పారు. దీతో అభివృద్ధి పనులకు అడ్డు పడుతున్నావంటూ స్థానిక అధికార పార్టీ వర్గం హెచ్ఎం మీద మండిపడింది. గోడ, టాయిలెట్స్ కట్టివ్వాలని హెచ్ఎం కోరగా.. తమ దగ్గర అంత ఫండ్ లేదనీ, గోడ వరకు తాము నిర్మించి ఇస్తామని చెప్పి వెళ్లిపాఓయారు.
డ్రయినేజీ పైపులై నిర్మాణం చేపట్టొద్దు
అల్వాల్ మండలంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల లోపలి నుంచి వివిధ కాలనీల సంబంధించిన డ్రయినేజీ అండర్ గ్రౌండ్ పైపులైన్ నిర్మాణాలను పాఠశాల ఆవరణ నుంచి తీసుకెళ్లడాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుంది. ఎలాంటి సమాచారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి గానీ, పాఠశాల సిబ్బంది గానీ ఇవ్వకుండా ఈ నిర్మాణ పనులు చేపట్టాలని చూడటం సరికాదు. ఈ నిర్మాణ పనులను ఇతర ప్రాంతం నుంచి చేపట్టాలి. ఇప్పటికైనా అధికారులు, అధికార పార్టీ నాయకులు వెంటనే స్పందించి పాఠశాల ఆవరణ నుంచి డ్రయినేజీ పనులను నిలిపివేసి ఇతర ప్రాంతాల నుంచి వేయాలి. పాఠశాల నుంచి ఈ డ్రయినేజీ నిర్మాణం చేపట్టడం వల్ల పాఠశాలలో ఉన్న విద్యార్థులందరూ అనారోగ్యానికి గుర య్యే పరిస్థితి ఉంది. ప్రభుత్వ పాఠశాలలను కాపాడాల్సిన అదికారులు, ప్రభుత్వం, రాజకీయ పార్టీల నాయకులు, ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రయత్నం చేస్తాయి. ఇప్పటికైనా వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.
బ్యాగరి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు
మాకు పర్మిషన్ కోసం లెటర్ ఇవ్వలేదు
అసలు మాకు పర్మిషన్ కోసం రిక్వెస్ట్ లెటర్ పెట్టలేదు. మేం పర్మిషన్ లెటర్ ఇవ్వకుండానే పైపులు తెచ్చి ఇక్కడ వేసి స్కూల్ కాంపౌండ్ నుంచి డ్రయినేజీ పైపులు వేయడానికి స్కూల్ ముందు ఉంచారు. అధికారులు, స్థానిక నాయకులు వచ్చి మేం పని మొదలు పెడుతాం అంటే నేను కలెక్టర్‌కి లెటర్ పంపినట్టు చెప్పాను. ఏఈ వచ్చి అంతా చూసి వెళ్లారు. వారు రిప్లై ఇవ్వనిది నేను ఎలా కూల్చివేతకు ఇంజినీరింగ్ వారికి లెటర్ ఇవ్వగలను. ఎప్పుడు ఏ నాయకులు వచ్చి మా పిల్లలు, స్కూల్ ఎలా ఉందని చూసిన సందర్భం లేదు. ఈరోజు ఇంత హడావుడి చేస్తూ రెండేం డ్లు ఉండి పోయేవాడివి అంటున్నారు. మరి పిల్లల పరిస్థితి ఏంటి? డ్రయినేజీ పైపుకు అక్కడక్కడ హౌల్స్ పెడితే డ్రయినేజీ జామై బయటకు పొంగితే పిల్లలు ఎలా చదువుకుంటారు. ఈ రోజు వేసి వెళ్ళిపోతారు.. కానీ పిల్లల గురించి ఆలోచించడం లేదు. ఇప్పటికే వర్షాలు పడినప్పుడు పైన ఇండ్లలోని నీరంతా స్కూల్లో నిండుతుంది. ఇప్పుడు అన్ని కాలనీల డ్రయినేజీతో కూడా స్కూల్ నిండాలా..? పిల్లలకు విద్యతో పాటు వసతులు కూడా కల్పించాల్సిన బాధ్యత నా మీద ఉంది. అభివృద్ధికి మేం అడ్డు పడం కానీ పిల్లల గురించి కూడా ఆలోచించాలి.
- సాయి కుమార్, పాఠశాల హెచ్ఎం
పిల్లలు, స్కూల్‌కి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు
నేను ఈ స్కూల్లోనే 1980లో చదువుకున్నాను. స్కూల్లో నుంచి డ్రయినేజీ పైపులు వేయడం దుర్మార్గపు ఆలోచన. ఇలా చేస్తే పేద పిల్లలకు విద్యను దూరం చేయడమే అవుతుంది. స్కూల్ వెనుక వైపు జరుపుకుంటూ వచ్చి అక్రమ నిర్మాణాలు కట్టారు. వాటిని కూల్చేసి అటు వైపు నుంచి డ్రయినేజీ వేసుకో వచ్చు కానీ స్కూల్లో వేయడం ఏంటి. అధికారులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ వారి ఇంట్లో నుంచి ఇలాగే డ్రయినేజీ పైపులు వేస్తానంటే వారు ఊరుకుంటారా..? స్కూల్ కోసం గజం భూమి అయినా ఇచ్చిన నాయకులు ఉన్నారా..? ఏ రోజు స్కూల్ గురించి పట్టించుకోని నాయకులు నేడు కాసులకు ఆశపడుతు న్నారు. పేద పిల్లల కడుపు కొట్టాలని చూస్తున్నారు. ఇది పిల్లలకు సంబంధించిన సమస్య కాబట్టి ఎవరూ ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఊరుకునేది లేదు. ఇప్పటికే 400మంది వరకు పిల్లలు ఉన్నారు. ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం మొదలవుతుంది. భవిష్యత్తులో పిల్లల సంఖ్య పెరుగుతుంది. అన్యాయం జరిగితే వదిలేది లేదు.
- సురేందర్ రెడ్డి, జేఏసీ నాయకులు