Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి ఈనెల 11వరకు నిర్వహణ
- అయిదేండ్లలోపు పిల్లలను బడిలో ఉండేలా ప్రచారం
- ఆపై పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు
- తల్లిదండ్రుల్లో చైతన్యం కలిగించనున్న అంగన్వాడీలు..
నవతెలంగాణ-సిటీబ్యూరో
అంగన్వాడీ టీచర్లు బడిబాట పట్టనున్నారు. అయిదేండ్లలోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరుతూ ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రుల్లో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నించనున్నారు. బాలబాలికలు, ఐదేండ్లలోపు పిల్లలు అంగన్వాడీ కేంద్రాల్లో, ఐదేండ్లు దాటితే బడుల్లో ఉండాలనే నినాదంతో పట్టణాలు, గ్రామాల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈనెల 11వ తేదీ వరకు బడిబాట నిర్వహించున్నారు.
జిల్లాలోని ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, స్థానిక పెద్దలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. దీంతో 11వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలో ప్రదర్శనలు నిర్వహించి.. చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మూడేండ్లు వచ్చిన ప్రతి చిన్నారి అంగన్వాడీ కేంద్రంలో చేరాల్సిన ఆవశ్యకత, అవసరాన్ని స్థానికులకు వివరించేలా అంగన్వాడీ టీచర్లను ఇప్పటికే సన్నద్ధం చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలు, పోషక పదార్థాల వివరాలు బడిబాటలో ప్రతి ఒక్కరికి వివరిస్తారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్) కింద అయిదు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్‌లోని ఆయా ప్రాజెక్టు పరిధిలో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 912 ఉండగా.. మినీ కేంద్రాలు రెండు ఉన్నాయి. వీటిలో మూడేండ్లు నిండిన పిల్లలను చేర్పించేందుకు బడిబాట కార్యక్రమం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. గతంలో అంగన్వాడీ కేంద్రాలను ప్రీ-స్కూల్ కార్యక్రమంగా భావించేవారు. పాఠశాలకు వెళ్లడం చిన్నారులకు అలవాటు చేసేందుకు ఉపయోగపడగా.. మరోవైపు చిన్నారులకు పౌష్టికాహారం అందించి.. వారితో ఆటలు ఆడించి.. పాఠశాల అంటే భయం పోగొట్టేందుకు పనిచేసేవారు. అయితే కేవలం పౌష్టికాహారం అందించడం.. ఆట పాటలతో గడపడమే కాకుండా.. వారికి విజ్ఞానాన్ని అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. చిన్నారులకు వర్క్‌బుక్‌లను అందించి.. వారితో హౌమ్ వర్క్ చేయించాలని నిర్ణయించారు.
కార్యక్రమాలు ఇలా..
బడిబాట సందర్భంగా ఏ రోజు.. ఏ కార్యక్రమం చేపట్టాలో అధికారుల నుంచి వివరాలు వచ్చాయి. ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం బడిబాట కార్యక్రమం నిర్వహిస్తారు. సోమవారం అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇందులో అంగన్వాడీ టీచర్లతోపాటు ఆయాలు, స్వయం సహాయక సంఘాలు, ఉపాధ్యాయులు, యువత, స్వచ్ఛంద సంస్థలు పాల్గొనాల్సి ఉంటుంది. అలాగే బడి మానేసిన ఆడపిల్లలను కూడా తిరిగి బడిలో చేర్పించేందుకు వీరు కృషి చేయాల్సి ఉంటుంది. ఇక ఈనెల 8,9 తేదీల్లో ఇంటింటికీ తిరిగి రెండున్నేండ్ల పిల్లలను గుర్తించాల్సి ఉంటుంది. చిన్నారుల తల్లిదండ్రులకు అంగన్వాడీ కేంద్రాల్లో అడ్మిషన్ల గురించి.. ప్రీ-స్కూల్ సిలబస్ గురించి, అక్కడ ఉండే టైమ్ టేబుల్, వర్క్ బుక్స్, పిల్లలకు ఇచ్చే యాక్టివిటీ బుక్స్, ప్రీ-స్కూల్ కిట్ మెటీరియల్ గురించి వివరిస్తారు.
11న సామూహిక అక్షరాభ్యాసం..
అలాగే అంగన్వాడీలో చేరిన పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యను అందించాల్సిన ఆవశ్యకతపై తల్లిదండ్రులకు వివరిస్తారు. ప్రత్యేక కార్యక్రమాలను అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేసి పిల్లల తల్లిదండ్రులు, వారి బంధువులను ఆహ్వానిస్తారు. స్థానిక పెద్దలను ముఖ్యఅతిథులుగా ఆహ్వానించి.. అంగన్వాడీ కేంద్రాల్లో తమ పిల్లలను ఎందుకు చేర్పించాలో వివరించేలా ఏర్పాట్లు చేస్తారు. ప్రీ-స్కూల్ మెటీరియల్‌ను బహిరంగంగా ప్రదర్శనలో ఉంచుతారు. ఇక 10వ తేదీన స్వచ్ఛ అంగన్వాడీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని శుభ్రపరచడం, ఆవరణను శుభ్రం చేసి అనవసరంగా ఉన్న సామగ్రిని తొలగిస్తారు. ఆవరణలో మొక్కలు నాటుతారు. తాగునీటి సదుపాయం కల్పించడంతోపాటు టాయిలెట్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటారు. 11న అంగన్వాడీ కేంద్రాల్లో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి పండుగ వాతావరణంలో నిర్వహించాలి. ప్రీ-స్కూల్ ప్రాధాన్యత, చదువు విశిష్టత తెలియజేసే సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించాలి. నూతనంగా నమోదైన పిల్లలు, వారి తల్లిదండ్రులతో హాజరయ్యేలా చూసి సమావేశం ఏర్పాటు చేయాలి. అక్షరాభ్యాసం కోసం కావాల్సిన సామాగ్రిన ముందుగానే సమాకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యవంతులుగా ఉన్న పిల్లలను గుర్తించి.. తల్లిదండ్రులకు బహుమతులు అందించనున్నారు. దీంతో అంగన్వాడీ బడిబాట కార్యక్రమం ముగియనుందని అధికారులు పేర్కొన్నారు.