Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో/అంబర్‌పేట
ప్రకృతిని ప్రేమిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందామని భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) పిలుపునిచ్చింది. అదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజాం కాలేజ్ కమిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్ గువేరా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటాలని కోరారు. మొక్కలు నాటడం వల్ల చెట్ల నుంచి విశ్వవ్యాప్తంగా ప్రజలకు సహజమైన, స్వచ్ఛమైన గాలిని ఇస్తుందని తెలిపారు. దేశంలో పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉందని సూచించారు. ప్లాస్టిక్ పదార్థాల వాడకం వల్ల పర్యావరణానికి, ప్రజలకు హాని కలుగుతుందనీ, వాటిని నిషేధించాలని కోరారు. పెట్టుబడిదారులు తమ లాభాల వేటలో ఏండ్ల తరబడిగా వివిధ పరిణామాలతో అభివృద్ధి చెందిన జీవసంక్లిష్ట వలయాల మధ్య అంతరం ఏర్పడేలా చేశారని గుర్తుచేశారు. కంపెనీలు, కర్మాగారాలలో సురక్షితమైన పనివాతావరణం ఉండాలనీ, టాక్సిన్స్, కాలుష్య కారకాలు లేకుండా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఐ కార్యదర్శి శేఖర్, నిజాం కళాశాల ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు శ్రీమాన్, సునీల్ రాఘవేంద్ర అభిమన్యు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో..
ప్రతి పౌరుడు మరింత బాధ్యతగా వ్యవహరిస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని వేదకుమార్ మణికొండ సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్(ఎఫ్‌బీహెచ్) పబ్లిక్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ సహకారంతో ఎన్విరాన్మెంట్ వాక్ నిర్వహించారు. ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ ప్రతినిధులు ఇ.ఆర్.వేదకుమార్ మణికొండ, పీజీడబ్ల్యూఏ చైర్మెన్ జనాబ్ గులాం యజ్దానీ పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని రక్షించే కేర్ టేకర్‌గా మారాలని అన్నారు. భూమిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పౌరులకు ఉందన్నారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులపై దేశ పౌరులకు అవగాహన ఉండాలన్నారు. గ్రీన్ బిల్డింగ్ భావనలను ఎక్కువ సంఖ్యలో స్వీకరించాలని, వర్షపు నీటి సంరక్షణ కోసం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్ తరాలకు మరింత మెరుగైన వాతావరణాన్ని నిర్మించడంలో ప్రజలు మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.