Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూల్‌బాగ్ పర్యటనలో మంత్రి తలసాని
నవతెలంగాణ-సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్
ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, అర్హులందరికి త్వరలోనే ఇండ్లను కేటాయిస్తామని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హామీ ఇచ్చారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని పూల్‌బాగ్‌లో పర్యటించి మొక్కలు నాటారు. జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్ల కాలనీలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో అర్హులను గుర్తించి జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్లను కేటాయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా కాలనీలోని డ్రయినేజీ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కాలనీ ప్రజల కోసం రూ.50 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్‌ను నిర్మించి ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా కాలనీలోనే ఉన్న జీహెచ్ఎంసీ గ్రౌండ్‌ను క్రీడా స్థలంగా అభివద్ధి చేయాలని, మొక్కలు నాటాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎక్కడా డ్రయినేజీ లీకేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలని వాటర్‌బోర్డు అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవికిరణ్, కార్పొరేటర్ సురేఖ, మాజీ కార్పొరేటర్ మమతా గుప్తా తదితరులు ఉన్నారు.
నాంపల్లి నియోజకవర్గంలో..
నియోజకవర్గ పరిధిలోని పద్మనాభనగర్‌లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌లతో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో కొన్ని ఇండ్లకు నీటి సరఫరా కావడం లేదని మంత్రికి పిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వాటర్‌బోర్డు అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరగా, ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాలనీ వాసులు ఎంతో ఐక్యంగా ఉండి కాలనీని అభివద్ధి చేసుకోవడం పట్ల అభినందించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవికిరణ్, నాంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి ఆనంద్‌గౌడ్ పాల్గొన్నారు.