Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరద ప్రమాదాల నివారణకు చర్యలు
- నాలాల పునరుద్ధరణ, రిటైనింగ్ వాల్ నిర్మాణం
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన (జీహెచ్ఎంసీ) పరిధిలోని నాలాలపై బల్దియా ప్రత్యేక దృష్టి పెట్టింది. గత అనుభవాలను దృష్టిలోపెట్టుకుని నాలా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే నాలాల పునరుద్ధరణ, రిటర్నింగ్ వాల్ పనులను చేపట్టిన విషయం తెలిసిందే. పట్టణ ప్రగతిలో భాగంగా 17 నాలాల్లో పూడిక తీత పనులను చేపట్టింది.
ఎస్ఎన్డీపీ, నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో
జీహెచ్ఎంసీ పరిధిలో గల ఎస్ఎన్డీపీ, ఇంజినీరింగ్ నిర్వహణ విభాగాల ఆధ్వర్యంలో ఆయా కేటగిరీకి చెందిన అన్ని నాలాలకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన పాయింట్లను గుర్తించి జాగ్రత్త చర్యలు చేపట్టాలని బల్దియా అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తిచేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 1302 కిలోమీటర్ల గల స్ట్రామ్ వాటర్ డ్రయిన్లను నిర్వహిస్తున్నారు. అందులో 385 కిలోమీటర్ల మేజర్ నాలాలు, 917 కిలోమీటర్లు మైనర్ కాలువలను నిర్వహిస్తున్నారు. అయితే ప్రజలు తరచుగా నాలాలో నిర్మాణ, ఇతర వ్యర్థాలు వేసే, విభిన్న ప్రదేశాల (వల్నరబుల్ పాయింట్ల) గుర్తింపు, ట్రీట్మెంట్ కానీ మురుగు నీరు నాలాలో కలిసే లొకేషన్ల గుర్తింపు, పరిశ్రమలకు సంబంధించిన వ్యర్థాలు నాలాలో కలిసే లొకేషన్లతో పాటుగా ప్రమాద నివారణ చర్యలపై కూడా పరిశీలన చేసి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వర్షా కాలం వస్తున్న నేపథ్యంలో గుర్తించిన ప్రమాదకర పాయింట్ల వద్ద నాలా భద్రతా చర్యలు చేపట్టారు. చైన్ లింక్ మెష్, ప్రమాదాల నివారణకు హెచ్చరిక సైనేజి బోర్డు, ప్రీకాస్ట్ స్లాబ్స్ వేస్తున్నారు. ఎల్బీనగర్ జోన్లో 74 పాయింట్లలో భద్రత చర్యల్లో భాగంగా చైన్ లింక్మెష్లు, సైన్ బోర్డ్లను ఏర్పాటు చేశారు. కూకట్పల్లి జోన్లో 10 ప్రాంతాల్లో భద్రత చర్యలు తీసుకున్నారు. ఖైరతాబాద్జోన్లో 85 ప్రమాదకర పాయింట్లు, చార్మినార్ జోన్లో 52 పాయింట్లు, శేరిలింగంపల్లి జోన్లో 24 ప్రమాదకర పాయింట్లలో భద్రత చర్యలు చేపట్టామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో శాశ్వత నివారణ చర్యలతో పాటు ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు.