Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుస లైంగికదాడుల నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన
- జూబ్లీహిల్స్ ఘటన మరువకముందే మరో ఘటన వెలుగులోకి
- కార్ఖానా పీఎస్ పరిధిలో బాలికపై ఐదుగురు యువకుల లైంగికదాడి
- నిందితులకు రిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ సిటీలో ఇటీవల జరుగుతున్న వరుస లైంగికదాడి ఘటనలు నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కొందరు తమ కామవాంఛ తీర్చుకోవడానికి బరితెగిస్తున్నారు. పోలీసులు భద్రతను కూడా లెక్కచేయకుండా రోడ్డుపై కారులో తిరుగుతూ కొందరు లైంగిక దాడికి పాల్పడుతుంటే మరికొందరు ప్రేమ పేరుతోనో, నయానో భయానో యువతులను వేధిస్తుండటం, అఘాయిత్యాలకు పాల్పడుతుండటం కలవరపెడుతున్నాయి. నగరంలో రోజుకో దారుణం వెలుగు చూస్తుండటంతో పలువురు భయాందోళనకు గురవుతున్నారు. జూబ్లీహిల్స్, పహడీ శరీఫ్, నెక్లెస్‌రోడ్‌లో జరిగిన లైంగికదాడి సంఘటనలు మరువకముందే తాజాగా కార్ఖానాలో బాలికపై యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన మరో ఘటన వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.
చట్టాల్లో లొసుగులు అడ్డం పెటుకుని...
మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా దోషులకు సకాలంలో శిక్షలు పడని కారణంగా కామాంధుల్లో భయం కనిపించడం లేదు. కొందరు చట్టాల్లోని లొసుగులను అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా జైళ్ల నుంచి బయటకు వస్తున్నారు. ఇటీవల ఘటనలతో పాటు గతంలో జరిగిన అనేక ఘటనలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. సిటీలో 2019లో 281 లైంగిక దాడులు జరిగాయి. 2020లో 265, 2021లో 328 లైంగిక దాడి ఘటనలు జరిగాయి. ఈ ఏడాది దాదాపు 20కిపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రంలో పెరిగిన లైంగిక దాడి ఘటనలు
తెలంగాణలో లైంగికదాడి ఘటనలు పెరిగిపోయాయని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి మండిపడ్డారు. పసిపిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఒక్కరోజే ముగ్గురు మైనర్లపై లైంగికదాడి జరిగిందని, హైదరాబాద్‌లో షీ టీమ్స్ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఇన్నోవా కారులో దొరికిన ఆధారాలు నిజమైనవేనా? ప్రశ్నించారు. మహిళలకు భద్రత కల్పించలేనప్పుడు హోం మంత్రి ఎందుకని, వరుస ఘటనల నేపథ్యంలో హోం మంత్రి పదవీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
కార్ఖానా పరిధిలో మరో దారుణం
జూబ్లీహిల్స్‌లో బాలికపై లైంగికదాడి ఘటన మరువకముందే తాజాగా సికింద్రాబాద్ పరిధిలో మైనర్‌పై లైంగికదాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ బాలికపై ఐదురుగు నిందితులు వేర్వేరు రోజుల్లో లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కార్ఖానా పీఎస్ పరిధిలో జరిగింది. బాలికతో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్న ధీరజ్, రితేష్ ఫ్రెండ్షిప్ పేరుతో మభ్య పెట్టారు. వేర్వేరు రోజుల్లో లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. వారితోపాటు మరో ముగ్గురు కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని విచారణ జరిపిన పోలీసులు ఐదుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈమేరకు మే 30న కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు యువకులు, ఇద్దరు లాడ్జ్ నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.