Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విగ్రహాల తయారీకి మట్టిని ప్రభుత్వమే సమకూర్చాలి
- భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఆగస్ట్ 31న గణేశ్ ఉత్సవాలు ప్రారంభవుతాయని, ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లతో ఘనంగా నిర్వహించాలని భాగ్యనగర్ ఉత్సవ గణేశ్ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు అన్నారు. విగ్రహాల తయారీ కోసం మట్టిని సైతం ప్రజలకు అందించాలని సూచించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈఏడాది గణేశ్ ఉత్సవాలు ఆగస్ట్ 31 మొదలవుతాయని, సెప్టెంబర్ 9న హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తామన్నారు. వినాయక చవితి ఉత్సవాలు సాఫీగా జరిగేటట్టు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కోరారు. వినాయక్‌సాగర్, ట్యాంక్‌బండ్‌లో పెద్ద విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని పోలీసులు చెప్పడం బాధాకరమని చెప్పారు. అసలు ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ (పీఓపీ) అంటే పోలీసులకు, ప్రభుత్వానికి కూడా తెలియనట్టుగా ఉన్నదని విమర్శించారు. హిందూ పండుగలను అణగదొక్కాలని చూస్తే తాము ఊరుకోమని, గణేశ్ ఉత్సవాలపై ప్రభుత్వం అఖిలపక్షంతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలని లేదా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఉపాధ్యక్షులు రామ రాజు, నర్సింగ్ పురియా, కార్యదర్శులు కె. మహేందర్, శశిధర్, బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.