Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేట్ కాలేజీల్లో పీహెచ్డీ కోర్సులకు అనుమతిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్
నవతెలంగాణ-ఓయూ
ప్రయివేట్ కాలేజీల్లో పీహెచ్డీ ప్రవేశాలకు ఓయూ పాలక మండలి అనుమతి ఇవ్వడానికి, అదేవిధంగా క్లస్టర్ విధానానికి వ్యతిరేకంగా పీడీఎస్యూ (విజంభణ) ఆధ్వర్యంలో గురువారం ఓయూ పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్పొరేట్ దోపిడీ వస్తువుగా ఉన్నత విద్యను మార్కెట్లో అమ్మకం సరుకుగా పరిశోధన పట్టాలను చేయాలని చూస్తున్న ఓయూ పాలక వర్గ వైఖరిని ఖండించారు. ప్రభుత్వం దగ్గర నిధులు అడిగే ధైర్యం లేక, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయలేక ఓయూ ప్రతిష్ట దిగజార్చే కార్యక్రమాలు చేయొద్దని సూచించారు. ఈచర్యలను వెనక్కి తీసుకోకపోతే విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ప్రయివేట్ కళాశాల పుణ్యమా అంటూ ఉన్నత విద్యా నిర్వీర్యం అయిందన్నారు. ధర్నాలో పాల్గొన్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. విద్యార్థి నాయకులు బాబురావు, పీడీఎస్యూ (విజంభణ) రాష్ట్ర అధ్యక్షుడు అల్లూరి విజరు, ఉపాధ్యక్షులు దుర్గం దిలీప్, సిటీ కన్వీనర్ దేవ్, నిజాం కాలేజీ కన్వీనర్ రాజేష్, సందీప్, అఖిల్, సుధాకర్లను అరెస్ట్ చేయడాన్ని పీడీఎస్యూ (విజంభణ) ఓయూ కమిటీ ఖండిస్తుందని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.