Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వితంతువు నుంచి రూ.10.65లక్షలు వసూలు
- వివరాలు వెల్లడించిన ఏసీపీ కేవీఎం ప్రసాద్
నవతెలంగాణ-సిటీబ్యూరో
మ్యాట్రిమోని వెబ్ సైట్లను టార్గెట్ చేసుకుని పెండ్లిపేరుతోమోసాలకు పాల్పడుతున్న నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నైజీరియాకు చెందిన కాబ్రల్ ఎడ్మండో కొన్నేండ్ల క్రితం ఇండియాకు వచ్చాడు. అప్పటి నుంచి ఢిల్లీలోని ద్వారకాలో నివాసముంటున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించాలని మ్యాట్రిమోని(వివాహాల పోర్ట్ల్) సైట్లను టార్గెట్ చేసుకున్నాడు. తప్పుడు సమాచారంతో మ్యాట్రిమోనిలో రిజిస్ట్రర్ అవుతున్నాడు. అమ్మాయిలనే కాకుండా విడాకులు తీసుకున్న మహిళలను, రెండో పెండ్లికి సిద్ధమైన వారితోపాటు అమాయకులను టార్గెట్ చేసుకుంటున్నాడు. మీ ప్రొఫైల్ నచ్చిందని, తాను విదేశాల్లో వ్యాపారవేత్తగానో, డాక్టర్గాలో, ఉన్నత స్థాయిలో ఉన్నట్టు వివిధ పేర్లతో పరిచయం చేసుకుని చాటింగ్‌లు, మెసేజ్‌లు చేస్తూ క్లోజ్‌గా ఉంటూ నమ్మిస్తాడు. ఇంట్లో చెప్పి ఒప్పిస్తానని, నిన్ను కలిసేందుకు ఇండియాకు వస్తున్నట్టు చెప్తాడు. వచ్చేటప్పుటు నీ కోసం గిఫ్ట్‌లు, డబ్బులు, బంగారు ఆభరణాలు తీసుకొస్తుంటే ఏయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారనో లేదా వివిధ కారణాలు చెప్పి అందిన కాడికి డబ్బులు దండుకుంటాడు. ఇదే తరహాలో ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన ఓ వితంతువును టార్గెట్ చేసుకున్న నిందితుడు తన పేరు క్రిష్ణ కుమార్‌గా స్కాట్‌ల్యాండ్ దేశానికి చెందిన వాడిగా పరిచయం చేసుకున్నాడు. వాట్సాప్‌లో చనువుపెంచుకున్నాడు. మీ ప్రొఫైల్ నచ్చిందని పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమెను చూసేందుకు గత ఫిబ్రవరి 7న హైదరాబాద్‌కు వస్తున్నాని అప్పుడే తల్లిదండ్రులకు నచ్చజెప్పి పెండ్లి చేసుకుందామని చెప్పడంతో ఆమె సరేనంది. ఇదిలావుండగా అదే నెల 8న ఆమెకు గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. తాను ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చెందిన అధికారిగా పరిచయం చేసుకున్నాడు. క్రిష్ణకుమార్ తీసుకొస్తున్న లగేజీలో విలువైన వస్తువులు, భారీ ఎత్తున కరెన్సీ, గిఫ్ట్లున్నాయని మీ కోసం తీసుకొస్తున్నట్టు చెప్పాడన్నారు. వాటిని రిలీజ్ చేయాలంటే (ట్యాక్స్) పన్నులు చెల్లించాల్సివుంటుందని చెప్పాడు. ఇదే తరహాలో వివిధ రుసుంల పేర్లు చెప్పి దాదాపు రూ.10,65,000లను వివిధ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయించుకున్నారు. అయినప్పటికి పదేపదే డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితురాలు గత ఫిబ్రరి 14న సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. జాయింట్ సీపీ ఆదేశాలు, ఏసీపీ సూచనలతో విచారణ చేపట్టిన ఇన్స్పెక్టర్ గంగాధర్ ఎస్ఐ శాంతారావు, కానిస్టేబుళ్లు సునీల్, నర్సింగ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఎంతో శ్రమించి నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మ్యాట్రిమోని వెబ్సైట్లో మీ వివరాలు చూశామని, పెండ్లి చేసుకుంటానని ఎవరైనా నమ్మిస్తే నమ్మిమోస పోవద్దని జాయింట్ సీపీ గజారావు తెలిపారు. ఒకటికి రెండుసార్లు వాస్తవాలను పరిశీలించుకోవాలన్నారు. నేరుగా కలువకుండా డబ్బులు పంపాలని కోరితే అనుమానించాలన్నారు.