Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- 43 తులాల బంగారం, 27 తులాల వెండి, రూ.4 లక్షల నగదు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన ఉత్తర మండల డీసీపీ చందనా దీప్తి
నవతెలంగాణ-బేగంపేట్
బట్టల వ్యాపారం ముసుగులో రద్దీగా ఉన్న బస్సులను ఎంచుకుంటారు.. విలువైన వస్తువులు గల వారిని గుర్తించి వారి దగ్గర హడావిడి చేస్తుంటారు.. వారి దృష్టి మరల్చి తమతో తీసుకువచ్చిన పరికరాలతో బ్యాగులను కత్తిరించి సొత్తును అపహరిస్తుంటారు. అలాంటి ముఠా సభ్యులను ఎట్టకేలకు పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. బట్టల వ్యాపారులుగా బస్సులో ప్రయాణిస్తూ ప్రయాణికుల దృష్టిని మరల్చి బ్యాగులో ఉన్న విలువైన వస్తువులను అపహరిస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆరుగురు అంతరాష్ట్ర ముఠాను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు గోపాలపురం పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.26 లక్షల విలువైన 43 తులాల బంగారం, 27 తులాల వెండి, రూ.4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఉత్తర మండల డీసీపీ చందనా దీప్తి తెలిపారు. శుక్రవారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చందనాదీప్తి మాట్లాడు తూ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన 6 మంది సభ్యుల ముఠాకు దిన్ మొహమ్మద్ అనే వ్యక్తి నిర్వాహకుడిగా ఉంటూ దొంగతనాలు చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దొంగతనం చేసేందుకు ముఠా సభ్యులకు డబ్బులను ఇస్తున్నట్టు పోలీసులు పేర్కొ న్నారు. దొంగతనం చేసిన ప్రాంతం నుంచి సుదూర ప్రాంతాల్లో బస చేసేవిధంగా ఏర్పాట్లు చేసి, ఒక దొంగతనంలో పాల్గొన్న వారిని మరో దొంగతనంలో పాల్గొనకుండా ఇతర సభ్యులను ఉపయోగిస్తూ ముఠా నడిపిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. గోపాలపురం పీఎస్ పరిధిలో బస్సులో దొంగతనం జరగడంతో బాధితురాలు గోపాలపురం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్టు డీసీపీ తెలిపారు.