Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్‌తో వీసీ ప్రొఫెసర్ రవీందర్ భేటీ
నవతెలంగాణ-ఓయూ
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఓయూ క్యాంపస్‌లో అడోబ్ సమీకత పరిశోధన, శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది. ఓయూ పూర్వవిద్యార్థి, అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్ ఇందుకు ముందుకు వచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలో ఓయూ వీసీ ప్రొ. రవీందర్ యాదవ్ శాంతను నారాయణ్‌తో భేటీ అయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో భాగంగా మెషిన్‌లెర్నింగ్ సాంకేతికతతో విద్యార్థులు, పరిశోధకులకు ఉపయోగపడేలా ప్రతిపాదన రూపొందించాలని ఈ సందర్భంగా వీసీకి అడోబ్ సీఈఓ సూచించారు. విశ్వ విద్యాలయం మొత్తానికి ప్రయోజనకరంగా ఉండే ఒక నిర్దిష్టమైన, ఆచరణీయమైన ఆలోచనతో డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ని సమర్పించాలని కోరారు. 1980లో ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకున్న ఆయన ఓయూతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. ఓయూ కోసం ఎలాంటి సహకారాన్ని అందించేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని వీసీకి స్పష్టం చేశారు. ఎంఐటీ, హార్వర్డ్ సహా ఇతర అమెరికన్ విశ్వవిద్యాలయాలు ఆర్థిక సమీకరణ కోసం ఉపయోగించే ఎండోమెంట్లను అధ్యయనం చేయాలని, ఓయూకు సైతం ఓ క్రమబ్దమైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలని ప్రతిపాదించారు. ఇప్పటికే ఓ వ్యవస్థను రూపొందించామని త్వరలోనే తుదిమెరుగులు దిద్ది ప్రక్రియ పూర్తి చేస్తామని ఓయూ వీసీ వారికి వివరించారు. యూనివర్శిటీలో విద్యా ప్రమాణాలు, పరిశోధనా ధోరణిని పెంపొందించడానికి ప్రొఫెసర్లు, విద్యార్థులకు మేధోపరమైన సహకారం అందించాలని వీసీ కోరారు. ఆగస్టులో హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఉస్మానియా అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశమవుతానని శాంతను నారాయణ్ తెలిపారు.
అనంతరం ఉస్మానియా పూర్వ విద్యార్థి, ప్రఖ్యాత అప్లైడ్ మెటీరియల్ శాస్త్రవేత్త, అప్లైడ్ వెంచర్స్ ప్రెసిడెంట్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఓంకారం నలమాసుతో ప్రొ. రవీందర్ భేటీ అయ్యారు. యూనివర్శిటీ అభివద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను వీసీ వివరించారు. 21-పాయింట్ ఎజెండా, క్లస్టర్ సిస్టమ్, ఫ్యాకల్టీ పబ్లికేషన్లకు వీసీ అవార్డును ప్రవేశపెట్టడం, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, సంక్రమిత త్రీడీ తయారీ కేంద్రం ఏర్పాటు సహా వివిధ సంస్కరణల గురించి చెప్పుకొచ్చారు. అభివద్ధి చెందుతున్న మార్కెట్లకు అనుగుణంగా పాఠ్యాంశాలను మెరుగుపరచాల్సిన అవసరాన్ని ఓంకారం నలమాసు సూచించారు. త్వరలోనే ఓయూ సందర్శించి పరిశోధకులు, విద్యార్థులతో సమావేశం కానున్నట్లు ప్రకటించారు. సిలికాన్ వ్యాలీలో ఉస్మానియా అల్యూమినై బలంగా ఉన్నందున దాదాపు పన్నెండు మంది సీఈఓలతో ప్రొఫెసర్ రవీందర్ సమావేశమై చర్చించారు. ఉస్మానియాకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక సహాయంపై ఈ సందర్భంగా పూర్వవిద్యార్థులు హామీ ఇచ్చారు. కార్యక్రమాలను ఓయూ పూర్వవిద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్ వెంకట్ మారోజు, విజరు చవ్వా, సాయి, గుండవెల్లి, జై ప్రకాశ్ సమన్వయం చేశారు.