Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
నవతెలంగాణ-సిటీబ్యూరో
లోతట్టు ప్రాంతాల్లో వరద నివారణ కోసం చేపట్టిన నాలా పునరుద్ధరణ పనుల్లో జాప్యం వద్దని, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ త్వరగా పూర్తిచేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి జోన్ చందానగర్ సర్కిల్లో రూ.10.30 కోట్ల వ్యయంతో ఈర్ల చెరువు నుంచి జాతీయ రహదారి 65 వరకు చేపట్టిన పునరుద్ధరణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం ద్వారా రూ. 985 కోట్ల అంచనా వ్యయంతో 60 పనులు చేపట్టగా జీహెచ్ఎంసీ పరిధిలో రూ.735 కోట్ల విలువగల 37 పనులను చేపట్టామని, పనులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ చుట్టూ మున్సిపాలిటీలలో రూ.238 కోట్ల విలువ గల 23 పనులు చేపట్టినట్లు వెల్లడించారు. వర్షాకాలంలో నాలాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
ఈదుల చెరువు దత్తత
ఈదుల చెరువు సుందరీకరణకు సంబంధించిన అభివృద్ధి పనులను చేపట్టడానికి మేయర్ దత్తత తీసుకున్నారు. గతంలో లంగర్‌హౌస్ చెరువును దత్తత తీసుకున్న 15 రోజుల్లోనే సుందరీకరణ పనులను పూర్తి చేయించారు. అదే మాదిరిగా ఈదుల చెరువులో ఉన్న గుర్రపు డెక్కలు తొలగించడంవల్ల దోమల ఉత్పత్తిని నిరోధించాలన్నారు. చెరువు సుందరీకరణ పనులలో భాగంగా గార్డెన్, కట్ట పటిష్టత, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌తో పాటు ప్రజలకు అవసరమైన ఇతర పనులను చేపట్టి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.
ఎస్ఎన్డీపీ చీఫ్ ఇంజినీర్ వసంత మాట్లాడుతూ... కూకట్పల్లి, శేరిలింగంపల్లి జోన్లతో చుట్టూ పక్కన గల మున్సిపాలిటీలలో నాలాల అభివృద్ధి పనుల గురించి మేయర్‌కు వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.