Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
- మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహణ
- ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్‌నేత దాసోజు శ్రవణ్ తదితరులు హాజరు
నవతెలంగాణ-బంజారాహిల్స్
నేరాలు, వివిధ కేసులకు సంబంధించిన అంశాలు ముందుకు వచ్చినప్పుడు పోలీసులు స్వతంత్య్రంగా వ్యవహరించేవారని, ప్రస్తుతం రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయని, రాజకీయ ప్రభావం పోలీసులపై ఉంటోందని వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 'తెలంగాణలో మహిళలపై నేరాలు-పోలీసులపై రాజకీయ ప్రభావం' అనే అంశంపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సామాజిక, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. సమావేశంలో ముందుగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో పోలీసులపై రాజకీయ ప్రభావం ఉండేదని, కానీ నిజాం కాలం నుంచి అది మరింత పెరిగిందని, ఇప్పుడు అది తారాస్థాయికి చేరుకుందని అన్నారు. ఓ ఘటనలో నిందితులు టీఆర్ఎస్ నేతల కుటుంబాలకు చెందిన వారని, దానిని దాచిపెట్టి, శిక్షను తగ్గించి బెయిల్ తెచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేయడం రాజకీయంగా పెద్ద ధుమారం రేపుతున్నదని అన్నారు.
2014 నుండి పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు 800 శాతం పెరిగాయని, వ్యాపార వివాదాలు, భూ వివాదాలు ఇతర అన్ని సామాజిక వివాదాలలో పోలీసుల ప్రమేయం ఉంటోందని చెప్పారు.
ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. మహిళలపై జరిగే నేరాల్లో రాజకీయ జోక్యం అనేది ఉండకూడదని, ఇలాంటి నేరాలకు ఒకే రకమైన శిక్ష విధించాలని, నేరాలను పరిశోధించే పూర్తి స్వేచ్చ పోలీసులకు ఉండాలని చెప్పారు. ఎమ్మెల్యేల ద్వారా పోలీసు పోస్టింగ్‌ల సిఫార్సును తక్షణమే నిలిపివేయాలని, అప్పుడే పోలీసింగ్‌పై ఎమ్మెల్యేల ప్రభావం తగ్గుతుందని అన్నారు. ఇటువంటి వాటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ కలిసి మార్పు కోసం ప్రయత్నించాలన్నారు. మద్యంపై నియంత్రణ తీసుకురావాలని, బెల్ట్ షాపులను అరికట్టాలని డిమాండ్ చేశారు. మద్యపాన నియంత్రణకు ఎక్సైజ్ మంత్రికి ప్రాతినిధ్యం ఇవ్వాలని, మహిళా కమిషన్ సమీక్ష సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని, పోలీసు పోస్టింగ్‌పై డీజీపీ అండ్ హోంమంత్రికి ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ... బాలికలపై ఇటీవల అఘాయిత్యాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం ఆమోదయోగ్యం కాదని, పలు విషయాలపై స్పందించే కేటీఆర్ కూడా ఈ విషయంలో పెద్దగా స్పందించలేదని చెప్పారు. మహిళలు, బాలకల భద్రత విషయంలో ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరారు. నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలీసులు జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన కేసును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి లైంగికదాడి కేసుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉండాలని, మొత్తం కేసు విచారణకు సంబంధించి న్యాయవ్యవస్థ ద్వారా విచారణ జరగాలని కాంగ్రెస్ తరపున డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
సామాజిక కార్యకర్త సంధ్య మాట్లాడుతూ.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి మహిళలపై నేరాలపై మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఇది కేవలం మహిళల సమస్య కాదు, ప్రతి ఒక్కరి సమస్య అని చాటారన్నారు. మహిళలపై నేరాలు పెరుగుతున్నాయన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ అంశంపై చర్చించలేదు కదా కనీసం సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించలేదన్నారు. ఎన్నో పోరాటాల తర్వాత ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలకు జవాబుదారీతనం లేదని, ప్రభుత్వం పూనం మాలకొండయ్య కమిషన్‌ను ఏర్పాటు చేసిన తొలిరోజున చాలా మంది దానికి అర్జీలు పెట్టుకున్నా నేటికీ అవి అమలుకు నోచుకోలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలన్నీ సమీక్షా సమావేశాలను నిర్వహించేవారని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటివేమీ చేయకపోవడం విడ్డూరమని అన్నారు.