Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మీర్పేట్
పేదింటి ఆడపడుచుల పెద్దన్న కేసీఆర్ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మీర్పేట్ లోని ప్రభుత్వ పాఠశాలలో కల్యాణ లక్ష్మి లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతికూల సమయంలో ప్రభుత్వానికి ప్రతీనెలకు కోట్లాది రూపాయలు నష్టం వస్తున్నప్పటికీ పేదవారికి అందించే కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు వంటి సంక్షేమ పథకాలను మాత్రం ఆపవద్దన్న వాటిని కొనసాగిస్తున్నారని తెలిపారు. కేవలం ఒక బాలాపూర్ మండలంలోనే ఒక సంవత్సరం కాలంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. కోటి 59 లక్షల కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశామన్నారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఇలాంటి గొప్ప పథకం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికలు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 11లక్షల పైచిలుకు మందికి లబ్ది చేకూరిందన్నారు. మూడేండ్లుగా కేవలం బాలాపూర్ మండల రెవెన్యూ పరిధిలోనే 4351 మందికి రూ. 43 కోట్లపై చిలుకు లబ్దిదారులకు సహాయం అందిందన్నారు. ఒక్కో ఇంట్లో రెండు, మూడు చెక్కులు కూడా అందాయని, ఎలాంటి షరతులు లేకుండా ఒక ఇంట్లో ఎంత మంది అమ్మాయిలు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. మధ్యవర్తిత్వం, పైరవీలు, అవినీతికి, రాజకీయాలకు తావులేకుండా ఈ పథకాల ద్వారా అందరూ లబ్దిపొందుతున్నారని మంత్రి వివరించారు. మహిళలకు వివిధ పథకాల ద్వారా అండగా ఉంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందరూ అండగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాలాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మేయర్ దుర్గా దీప్లాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ భూపాల్‌రెడ్డి, అధ్యక్షులు కామేష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు లావణ్య, కార్పొరేటర్లు, రెవెన్యూ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.