Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫలిస్తున్న టీచర్ల ఇంటింటి ప్రచారం
- ఆరు రోజుల్లో 1506 విద్యార్థుల ప్రవేశాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
బడిబాట కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన బడిబాట కార్యక్రమం ఈ చివరి వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా పాఠశాలల పరిధిలోని ఉపాధ్యాయులు మండలాల్లో ఇంటింటికీ తిరుగుతూ పిల్లలను సర్కారు స్కూళ్లలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం మనబస్తీ-మనబడి కార్యక్రమం ద్వారా కల్పించబోయే మౌలిక సదుపాయాల గురించి, ఆంగ్లబోధన, ద్విభాషా పుస్తకాల ముద్రణ గురించి వివరిస్తున్నారు. మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, రెండు జతల యూనిఫాం వంటి గురించి సౌకర్యాల గురించి వివరిస్తున్నారు.
ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రతియేటా కొత్త విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు పెంచుకునేందుకు తమ సిబ్బందితో ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తారు. తమ స్కూల్లో నిపుణులైన సబెక్టు టీచర్లు ఉన్నారనీ, ఎడ్యూకేషన్ బాగుంటుందనీ, మౌలిక సదుపాయాలకు ఎలాంటి డోకా లేదని చెబుతుంటారు. అయితే ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో సైతం మనబస్తీ-మనబడిలో భాగంగా ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమ బోధన ప్రవేశపెడుతున్నారనీ, ఉపాధ్యాయులకు ఆంగ్ల బోధనలో శిక్షణ ఇచ్చి సుశిక్షితులుగా చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. నాణ్యమైన విద్యతో పాటు ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ వసతులు కల్పిస్తున్నామని పిల్లల తల్లిదండ్రులకు చెబుతున్నారు. 9,10 తరగతులకు పాత పద్ధతిలోనే బోధన సాగ నుంది. బడిబాట ప్రారంభమైన ఆరు రోజుల్లోనే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో 1506 మంది విద్యార్థులు చేరారు. నెల రోజుల బడిబాట కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రవేశాల డ్రైవ్ శుక్రవారంతో ముగి సింది. ఈ బడిబాట కార్యక్రమం ఈ నెల చివరి వరకు కొనసాగనుండగా.. అప్పటివరకు అడిష్మన్లు పెరిగే అవకాశం ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
కరోనా ప్రభావం.. సర్కారు బడి మేలు
ప్రయివేటు పాఠశాలల వైపు మొగ్గుచూపే వారు కరోనా కారణంగా రెండేండ్ల పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొందరు తమ పిల్లలను ప్రయివేటు పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్తోమత లేక అవే వసతులు, బోధనకు తోడు ఉచిత పుస్తకాలు, యూనిఫాం ప్రభుత్వ పాఠశాలల్లో ఇస్తుండటంతో ఈ ఏడాది ఎక్కువ మంది తల్లిదండ్రులు సర్కారు బడుల వైపు మొగ్గు చూపుతున్నారు. తమ పిల్లలను సర్కారు స్కూళ్లలో చేర్చేందుకు తల్లిదంద్రులు ముందుకొస్తున్నారనీ ఈ నెలాఖరులోగా ప్రవేశాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.