Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూఈఈయూ(సీఐటీయూ)
నవతెలంగాణ-బాలానగర్
విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని టీఎస్‌యూ ఈఈయూ (సీఐటీయూ) నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరారు.సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి మూడేండ్లు గడిచినా ఇప్పటి రెగ్యులరైజ్ చేయడం లేదని విద్యుత్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సమస్యలు పరిష్కరించాలని, రెగ్యులరైజ్ చేయనందుకు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించి డీఈకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆర్టిజన్ కార్మికుల ప్రొబేషన్ పీరియడ్‌ను అధికారులు డిక్లేర్ చేయడం లేదని, వెంటనే ప్రొబేషన్ పీరియడ్‌ను డిక్లేర్ చేసి అర్హతను బట్టి జేఎల్ఎం, ఎల్డీసీ, సబ్ ఇంజినీర్‌గా కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్ నోటిఫికేషన్ విడుదల చేసిన 1000 జె.ఎల్.ఎం. అండ్ 200 సబ్ ఇంజినీర్ పోస్టులను ఆర్టిజన్ కార్మికులకు మొదటి ప్రాధాన్యతగా భర్తీ చేయాలని, ఆర్టిజన్ కార్మికుల పర్సనల్ పే ను బేసిక్‌లో కలపాలని, ఆర్టిజన్ కార్మికులకు పరిమితిలేని మెడికల్ క్రెడిట్ సౌకర్యం కల్పించాలి. మిగిలిన 136 మంది కార్మికులను వెంటనే ఆర్టిజన్లుగా గుర్తించాలి. ప్రతి సబ్ స్టేషన్లలో నాలుగవ ఆపరేటర్‌ను నియమించాలని పలు డిమాండ్ల సాధన కోసం తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. ప్రసాద్ రాజు, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం. మోహన్, ఎన్ వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ హరినాథ్, కోశాధికారి రాజు, కార్మికులు రాజ్ కుమార్, అశోక్ పాల్గొన్నారు.