Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) అదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్ష నిర్వహణకు నగరంలో పలు ప్రాంతాల్లో 117 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్-1 పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి 12.00 గంటల వరకు, పేపర్-2 పరీక్షను మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించారు. ఇక పేపర్-1 పరీక్షకు 27,979 మందికి 25,662 మంది హాజరై 91.72 శాతం నమోదైంది. కాగా 2317 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పేపర్-2 పరీక్షకు 22,622 మంది అభ్యర్థులకు గాను 20,738 మంది హాజరై 91.67శాతం నమోదైంది. 1884 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. టెట్ కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. ప్రథమ చికిత్స కేంద్రాలు పెట్టారు. ఒక్క నిమిషం నిబంధనను పక్కాగా అమలు చేశారు అధికారులు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారిణి ఆర్.రోహిణీ పరిశీలించారు. ఇదిలావుంటే ఈసారి నుంచి టెట్ క్వాలిఫై అయితే లైఫ్ టైం వ్యాలిడీ కల్పించిన విషయం తెలిసిందే. అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల కోసం ఈసారి పేపర్-1 రాసేందుకు బీఈడీ పూర్తి చేసిన వారికి కూడా అవకాశమివ్వడంతో పోటీ పెరిగింది. కాగా టెట్ ఫలితాలు త్వరగా ప్రకటించి, టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని పలువురు అభ్యర్థులు కోరారు.