Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
పెంచిన ఆర్టీసీ బస్‌పాస్, టికెట్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఆధ్వర్యంలో ఆదివారం ఓయూ లేడీస్ హాస్టల్ రహదారిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ ఓయూ ప్రధాన కార్యదర్శి కె.స్వాతి మాట్లాడుతూ తెలంగాణలో విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లు ఇస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి ఆ హామీకి విరుద్ధంగా విద్యార్థుల బస్‌పాస్, టికెట్ చార్జీలు పెంచడం దారుణమని అన్నారు. బస్‌పాస్ చార్జీల పెంపుదలతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల విద్యా భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 165 ఉన్న మంత్లీ పాస్‌ను 450, రూ. 495 ఉన్న మూడు నెలల పాస్‌ను రూ.1200లకు పెంచారని, ఇది ముమ్మాటికీ పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రలో భాగమేనని అన్నారు. పేద, సాధారణ ప్రజలు ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు పెంచడం సీఎం కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనం అన్నారు. ఆర్టీసీని లాభాల బాటలో నడపాలంటే విద్యార్థులు, పేదలపై ఆర్థిక భారం మోపాలనుకోవడం అవివేకమని అన్నారు. ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు లక్షల రూపాయల జీతం/వేతనాలు ఇచ్చే బదులు ఆ నిధులను ఆర్టీసీకి, విద్యార్థుల బస్‌పాస్ రాయితీకి కేటాయిస్తే ఎక్కువ మేలు జరుగుతుందనా సూచించారు. ప్రజా ప్రతినిధులు కూడా పేద విద్యార్థుల కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పెంచిన ఆర్టీసీ, బస్‌పాస్ చార్జీలు తక్షణమే తగ్గించాలని, విద్యార్థులకు ఉచిత బసపాస్లు ఇస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి హామీని అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో ఐక్యవిద్యార్థి ఉద్యమాలను పెద్దఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఓయూ సహాయ కార్యదర్శి రుక్మత్ పాషా, చిరంజీవి, శ్వేత, వైష్ణవి, మేనక, కుమారి, సమత, రాము పాల్గొన్నారు.