Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి పాఠశాలల పున:ప్రారంభం
- జిల్లాలో 2156 స్కూళ్లు.. 7,79,254 మంది విద్యార్థులు
- పిల్లలు మాస్కులు ధరించేలా పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి
- అరకొరగానే పాఠ్యపుస్తకాల పంపిణీ!
నవతెలంగాణ-సిటీబ్యూరో
నేటి నుంచి 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులతో రెండు నెలల పాటు వెలవెలబోయిన బడులు సోమవారం నుంచి విద్యార్థులతో కళకళలాడనున్నాయి. సెలవుల్లో సొంతూళ్లకు, పర్యాటక ప్రదేశాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన సందడిగా గడిపిన పిల్లలు నేటీ నుంచి బడిబాట పట్టనున్నారు. అయితే స్కూళ్ల పున:ప్రారంభంతో ఇండ్లలో ఉదయాన్నే సందడి నెలకొననుంది. సెలవుల్లో ఆలస్యంగా నిద్రలేచి, ఆడుతూ, పాడుతూ గడిపిన పిల్లలకు ఒక్కసారిగా ఉదయం లేచి స్కూళ్లకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఫీలవుతారు. ఈ సమయంలో తల్లిదండ్రులు వారిని భయపెట్టి పాఠశాలకు పంపిస్తే వారు మరింత ఆందోళనకు గురువుతారనీ, బుజ్జగించి పంపించాలని నిపుణులు, ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.
సమస్యలతో స్వాగతం పలకనున్న బడులు..
హైదరాబాద్ జిల్లాలో 2156 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 7,79,254 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 693 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 1,06,635 మంది, 245 ఎయిడెడ్ పాఠశాలల్లో 36,782, 1221 ప్రయివేటు పాఠశాలలో 6,58,631 మంది వెళ్తున్నారు. నేటి నుంచి ప్రారంభమయ్యే పాఠశాలలు ఎప్పటిలాగే విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలకనున్నాయి. అయితే మరోవైపు సర్కారు ఎంతో ఆర్భాటంగా ఈ నెల 3 నుంచి బడిబాట కార్యక్రమం చేపట్టింది. ఈ నెల చివరి వరకు కొనసాగించనుంది. ఇదే సమయంలో నేటి నుంచి నెలరోజుల పాటు బిడ్జ్రి కోర్సు చెప్పనుంది. ఇందులో భాగంగా పై తరగతులకు ప్రమోట్ అయిన విద్యార్థి, కింది తరగతుల్లో చదివిన ముఖ్యమైన పాఠ్యాంశాలను ఈ రోజుల్లో చదవాల్సి ఉంటంఉది. ఇక జులై 1 నుంచి రెగ్యులర్ పాఠాలు బోధించనున్నారు.
అయితే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. సంవత్సరాల తరబడి పోస్టుల భర్తీ చేయకపోవడంతో జిల్లావ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో ఖాళీలతోనే పాఠశాల నిసష్ట్రటహణ కొనసాగుతోంది. కరోనా వ్యాప్తి, తదనంతరం పరిణామాలతో విద్యావాలంటీర్లను సైతం నియమించకుండానే రెండేండ్ల పాటు ఎలాగో నెట్టుకొచ్చారు. కొన్ని పాఠశాలల్లో అవసరాలమేరకు అక్కడక్కడా తాత్కాలికంగా ఇతర పాఠశాలల నుంచి ఒకరిద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై ఇచ్చారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు నేటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. అంతేగాక మనబడి-మనబస్తీలో భాగంగా కల్పిస్తామన్న మౌలికసదుపాయాల కల్పన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. పాఠశాల పరిశుభ్రత పనులకు నిధులు విడుదల చేయలేదు. స్వచ్ఛకార్మికులను తొలగించడంతో ఏడాదిన్నరగా బడి స్వచ్ఛత గాడితప్పింది. పిల్లలకు యూనిఫాం పంపిణీ చేపట్టలేదు. పాఠ్యపుస్తకాల పంపిణీ అరకొరగానే సాగుతోంది. ఇది ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి. ఇక ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు భారీగా ఫీజు వసూళ్లకు రంగం సిద్ధం చేసుకున్నాయి. కరోనాతో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి స్కూళ్ల నిర్వహకులు కొత్త ఫీజులను తెరపైకి తెస్తున్నాయి. డీజిల్ ధరలు, బస్సు ఫిట్నెస్ చార్జిలు పేరిట మోత మోగించేందుకు చూస్తున్నాయి. ప్రయివేటు స్కూళ్ల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫీజుల విషయంలో ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలను కట్టడి చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.