Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసీ ఇంజినీర్లకు షోకాజు నోటీసులు
- వర్షాకాలం వచ్చినా పనులు పూర్తి కాకపోవడంతో పురపాలక శాఖ ఆగ్రహం
నవతెలంగాణ-సిటీబ్యూరో
'ఏడాదిలో వరద నివారణ చర్యలు పూర్తి చేస్తాం. వరదలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. అందులో భాగంగానే ఎస్ఎన్డీపీని ఏర్పాటు చేశాం' అని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పలు సమా వేశాల్లో మాట్లాడారు. కానీ గ్రేటర్లో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. 2020లో భారీ వరద లొస్తే 2022 వరకూ వరద నివారణ చర్యలు పూర్తి కాలేదంటే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అందుకే ఎస్ఎన్డీపీ పనుల్లో నిర్లక్ష్యం వహించిన ఇంజినీర్లకు పురపాలకశాఖ షోకాజు నోటీసులు జారీచేసింది. క్లాసిఫికేషన్ కంట్రోల్ అండ్ అప్పీల్ (సీసీఏ) రూల్స్ ప్రకారం పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకుగాను, ఉన్నతాధికారులకు జవాబుదారీతనంగా లేనందుకుగాను మిమ్ములను ఎందుకు సస్పెండ్ చేయకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఆకస్మిక తనిఖీల్లో..
నాలా పనులను ఈనెల 6వ తేదీన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీబీఆర్ ఎస్టేట్, దీప్తి శ్రీనగర్లతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ నాలాలకు బారికేడింగ్ ఏర్పాటు చేయకపోవడం, ప్రమాద నివారణా చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తనిఖీల సందర్భంగా ఇంజినీర్ల నిర్లక్ష్యం కనిపించడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగానే షోకాజు నోటీ సులు జారీచేశారు. శేరిలింగంపల్లి జోన్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) ఎం.శివరాంప్రసాద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్రవంతి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సి.శ్రీకాంతి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వి.శ్రీనివాస్, ఏఈ సీహెచ్ సునీల్‌కుమార్ ఉన్నారు. కూకట్పల్లి జోన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కేవీఎస్ఎన్ టి.రాజు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్తీక్, ఏఈ కె.అరుణ్‌కుమార్, ఎల్బీనగర్ జోన్లో డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిలాల్, ఏఈఈ సంతోష్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.
నాలా పనులు నామమాత్రమే
జీహెచ్ఎంసీ పరిధిలో నాలాలు, డ్రయినేజీల అభివృద్ధికి రూ.9858 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వచ్చే వర్షాకాలంలోగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో రూ.958 కోట్ల అంచనా వ్యయంతో వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిధితో పాటు చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీల్లో మొత్తం 60 పనులు, జీహెచ్ఎంసీ పరిధిలో 37 పనులకుగా 50 శాతం కూడా పూర్తి కాలేదని అధికారులు చెబుతున్నారు. రెండేండ్లుగా నగరంలోని వరదలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని కేటీఆర్ పలు సందర్భాల్లో వెల్లడించారు. కానీ ఎస్ఎన్డీపీ పనులు ఆశించిన స్థాయిలో పూర్తికాకపోవడంతో అధికారులపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు.