Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పని ఒత్తిడితో మరణించిన సుజాత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
- తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ డిమాండ్
- ఆశావర్కర్ల పనిభారం పెంచుతున్న ప్రభుత్వ వైఖరిపై పలుచోట్ల నిరసనలు
నవతెలంగాణ-సిటీబ్యూరో/ధూల్‌పేట్/దుండిగల్
ఆశావర్కర్లపై పనిభారం తగ్గించాలని, హైదరాబాద్ జిల్లాలోని శాలివాహన నగర్ యూపీహెచ్సీ పరిధిలో పనిచేస్తూ పని ఒత్తిడి, అధికారుల వేధింపుల కారణంగా గుండెపోటుతో మరణించిన ఆశా వర్కర్ బి.సుజాత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా ఆశావర్కర్లు ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు చేపట్టారు.
గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ క్రాస్ రోడ్డు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్షకార్యదర్శులు కె.ఈశ్వర్రావు, ఎం.వెంకటేశ్ మాట్లాడుతూ.. సుజాత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు ముగ్గురు పిల్లలను ప్రభుత్వమే చదివించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి శనివారం జూమ్ మీటింగ్ పెట్టి ఆశాలపై అధికారులు ఒత్తిడి పెంచుతున్నారని అన్నారు. అధికారుల వేధింపుల కారణంగా అనేక మంది ఆశా వర్కర్లు రోగాల బారిన పడుతున్నారని, చిన్న వయస్సులోనే బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, మెడ నరాల నొప్పులు వంటివి వస్తున్నాయని చెప్పారు. రోజుకు 10 నుంచి 12 గంటలు పని చేయిస్తున్నారని, ప్రతి రోజూ ఎన్సీడీ సర్వే పేరుతో 100 ఆధార్‌కార్డుల పేర్లతోపాటు సెల్ నెంబర్లను ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. పనికితగ్గ పారితోషికం అని చెప్పి ప్రభుత్వం ఆశాలతో వెట్టిచాకిరి చేయిస్తోందని విమర్శించారు. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం రూ.10వేలు ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం, జాబ్‌చార్ట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్షురాలు యాదమ్మ, సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కోశాధికారి ఆర్.వాణి, ఉపాధ్యక్షులు జి.రాములు, నాయకులు పుల్లారావు, బి.మహేష్, ఆశా వర్కర్లు అనురాధ, అనిత, తదితరులు పాల్గొన్నారు.
సంతోష్‌నగర్ చౌరస్తాలో..
ఆశా వర్కర్లపై పనిభారం తగ్గించాలని, పని ఒత్తిడితో చనిపోయిన సుజాత కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీఐటీయూ సౌత్జిల్లా కార్యదర్శి పి.నాగేశ్వర్, ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి ఎం. మీనా డిమాండ్ చేశారు. శుక్రవారం ఆశావర్కర్లపై పనిభారాన్ని, వేధింపులను నిరసిస్తూ సంతోష్ నగర్ చౌరస్తాలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సుజాత కుటుంబానికి న్యాయం చేయాలని, ఆమె పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే.జంగయ్య, సహాయ కార్యదర్శి కిషన్, ఆశాలు సఫియా, యాదమ్మ, అఖిల, పుష్పలత, కవిత, గీతాంజలి, సరిత, శ్రీలత, జయశ్రీ, ఆశ్రా బేగం, భారతి తదితరులు పాల్గొన్నారు.
దుండిగల్ పీహెచ్సీ వద్ద
వృత్తిపరమైన పనిభారం, టార్గెట్లు పూర్తి చేయాలన్న పైఅధికారుల ఆదేశాల మధ్య తీవ్ర మానసిక వ్యథతో అకస్మాత్తుగా మరణించిన ఆశా వర్కర్ సుజాత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని సీఐటీయూ దుండిగల్ మండల కార్యదర్శి బొడిగె లింగస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో దుండిగల్ ప్రాథమి ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా ఆశా వర్కర్లపై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ.. మలక్‌పేట ప్రాంతంలో పనిచేస్తున్న ఆశావర్కర్ సుజాత టార్గెట్ పూర్తి చేయాలన్న ఉన్నతాధికారుల వేధింపులతో మరణించారని చెప్పారు. సుజాతకు ముగ్గురు పిల్లలు ఉన్నారు అని, ఆమె కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని, రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. సుజాత కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా చేస్తున్న ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి. జయలక్ష్మిని, సీఐటీయూ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఆశావర్కర్లపై పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ సభ్యులు లలిత, స్వరూప, కాత్యాయని, భాగ్యమ్మ, కృష్ణవేణి, పద్మ, దుండిగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.