Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24.74కోట్ల నష్టపరిహారం
- చీఫ్ జడ్జి రేణుకా యారా
నవతెలంగాణ-సిటీబ్యూరో
జాతీయ లోక్ అదాలత్ భాగంగాలో అదివారం హైదరాబాద్ జిల్లా స్థాయిలో పలు సివిల్ కోర్టుల్లో మొత్తం 1,518 సివిల్ కేసులు పరిష్కారం చేసి బాధితులకు, వాదులకు రూ. 24కోట్ల 70లక్షలు 81వేలపైగా నష్టపరిహారం అందజేసే విధంగా కేసులను రాజీకి కుదిర్చినట్లు సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ రేణుకా యారా తెలిపారు. నగరంలోని సివిల్ కోర్టులలో మొత్తం పది బెంచీలు ఏర్పాటు చేసి లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 324 మోటార్ ప్రమాదం ఇన్సూరెన్స్ క్లెయిమ్ కేసులనూ పరిష్కరించి బాధితులకు రూ.21కోట్ల నష్టపరిహారాన్ని అందజేసే విధంగా రాజీ మార్గంలో కేసుల పరిష్కారం జరిగినట్టు ఆమె వివరించారు. పర్మినెంట్ లోక్ అదాలత్లోని ప్రజా సేవల రంగంలోని ప్రి లిటిగేషన్ కేసులు, ఎస్బీఐ బ్యాంక్ కేసులు 1092కు పైగా పరిష్కరించినట్టు తెలిపారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిటీ సివిల్ కోర్టు కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.మురళీమోహన్ మాట్లాడుతూ సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ న్యాయస్థానంలోని లోక్ అదాలత్ బెంచ్లకు చీఫ్ జడ్జి రేణుకా యారా, సిటీ స్మాల్కాజు కోర్టు చీఫ్ జడ్జి నిర్మల గీతాంబ, రెండవ అదనపు చీఫ్ జడ్జి కె.ప్రభాకర్ రావు, అదనపు జిల్లా న్యాయమూర్తులు ఉమాదేవి, అపర్ణ, సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ మహి, జూనియర్ సివిల్ జడ్జి అరుణ్ కుమార్, తదితరులు నేతృత్వం వహించగా.. సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో అదనపు చీఫ్ జడ్జి జీవన్ కుమార్ నేతృత్వం వహించినట్టు తెలిపారు. కేసుల సత్వర పరిష్కారం కోసం లోక్ అదాలత్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో సివిల్ కోర్టులకు విచ్చేసిన కక్షిదారులకు న్యాయ సేవాధికార సంస్థ తాగునీరు, ఆహార పొట్లాలు పంపిణీ చేసినట్టు న్యాయమూర్తి కె.మురళీమోహన్ వివరించారు.
ఒక్కటైన కుటుంబాలు..
జాతీయ లోక్ అదాలత్లో లోకల్ రాజ్ పద్ధతిని ప్రోత్సహిస్తూ విడిపోయే పలు జంటలను వివాదాల్లో చిక్కుకున్న కుటుంబాలను న్యాయమూర్తుల చొరవతో రాజీ కుదిర్చి వారిని ఒకటి చేశారు. సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో విడిపోయిన ఒక జంటను అదనపు జిల్లా న్యాయమూర్తి జీవన్ కుమార్ లోక్ అదాలత్ సాక్షిగా కలిపి వారిని ఒకటి చేసి జంటగా ఇంటికి పంపారు. దత్త కుమారుడు, సొంత పిల్లలకు మధ్య తల్లిదండ్రుల బాధ్యత ఈ విషయంలో జరిగిన ఒక కుటుంబ వివాదాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చొరవతో కౌన్సిలింగ్ నిర్వహించి న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.మురళి మోహన్ ఆ కుటుంబాన్ని కలిపారు. దత్త కుమారుడు, కోడలికి మనవరాళ్లకు ప్రేమాభిమానాలతో తల్లిదండ్రులు కొంత ఆస్తి, డబ్బు అప్పగించారు. పిల్లలందరూ న్యాయమూర్తి ఉమాదేవి సమక్షంలో మాట ఇచ్చి కుటుంబ వివాదాన్ని పరిష్కరించుకున్నారు.