Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
స్త్రీలూ మసీదులో నమాజ్ చేయవచ్చా? మసీదులోకి స్త్రీలు ప్రవేశం నిషేధమా? ముస్లిమ్ మహిళలు ఇంట్లోనే నమాజు చేసుకోవాల్నా? స్త్రీలు హిజాబ్ ఎందుకు ధరిస్తారు? ఐదు పూటలా నమాజు ఎందుకు? ఖుర్ఆన్ ముస్లిములకే పవిత్ర గ్రంథమా? అజాన్ అర్థ వివరణ ఏమిటి? ఇలా ఎన్నో సందేహాలను నివత్తి చేసుకున్నారు హిందూ, క్రైస్తవ మహిళలు. ఆదివారం సెవెన్ టోంబ్స్ మార్గంలోని ఇస్లామిక్ సెంటర్ మసీదు తలుపులు అన్ని మతాల వారికోసం తెరుచుకున్నాయి. ముఖ్యంగా విభిన్న మతాలకు చెందిన స్త్రీలను మసీదుకు ఆహ్వానించారు. జమాఅతె ఇస్లామీహింద్ టోలీచౌకీ మహిళా విభాగం నాయకురాలు నసీమ్ సుల్తానా బృందం సందర్శకులకు స్వాగతం పలికింది. విజిట్ మాస్క్ పేరుతో నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమంలో పలు మతాల వారు హాజరయ్యారు. మసీద్ కట్టడం ప్రాధాన్యత, నమాజులో చదివే సూక్తుల గురించి వివరించారు. నమాజుకు ముందు చేసే వుజూ ప్రక్రియ, నమాజు విధానం, ఉపవాసాల విశిష్టత గురించి, ఖుర్ఆన్ సందేశాన్ని వివరించారు. మసీదులో స్త్రీలకు ప్రవేశం లేదు అన్నది కేవలం అపోహమాత్రమేనని నసీమ్ సుల్తానా చెప్పారు. అయితే మసీదులో స్త్రీలకోసం సమావేశ మందిరం, ప్రవేశ ద్వారం ప్రత్యేకంగా ఉండాలని ఆమె వివరించారు. జుట్టును కప్పుకోవడం, నిండైన వస్త్రధారణ ధరించడం ఇది ఖుర్ఆన్ లో అల్లాV్‌ా చెప్పే డ్రెస్ కోడ్ అని ఆమె అన్నారు. నమాజుకోసం పిలుపే అజాన్ అని, నమాజుకు సారధ్యం వహించే వారిని ఇమామ్ అంటారని వివరించారు. జమాఅతె ఇస్లామీహింద్ టోలీచోకీ స్థానిక అధ్యక్షులు డాక్టర్ ముబష్షిర్ ఆధ్వర్యంలో స్త్రీ, పురుషులకు వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇస్లామిక్ సెంటర్ మసీదులో శుక్రవారం, పండుగ నమాజులు చదివేందుకు ముస్లిమ్ మహిళలు వస్తారని, వారికోసం ప్రత్యేక ప్రార్థన మందిరం ఏర్పాటు చేశామని ముబష్షిర్ అన్నారు. ప్రతీ వారం మహిళలకు ధార్మిక సమావేశమూ మసీదులో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.