Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
కరోనా అనంతరం ఆన్లైన్ సేవలు విస్తరించిన నేపథ్యంలో వైద్య సేవలను ప్రజల చెంతకు చేర్చేందుకు మెడ్ మెడికల్ సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ మందుల దుకాణాలను ఆనంద ఈ క్లినిక్స్గా తీర్చిదిద్దనుంది. మంగళవారం అమీర్‌పేట్‌లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆనంద ఈ క్లినిక్స్ విధానాన్ని మెడ్ లే మెడికల్ సంస్థ వ్యవస్థాపకులు సత్యేంద్ర వివరించారు. సులభమైన వేగవంతమైన సరళమైన విధానంలో ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కొద్దిపాటి స్థలం కలిగిన మెడికల్ షాప్‌లో తమ సంస్థ తరఫున కియోస్కులను ఏర్పాటు చేసి డాక్టర్లను సంప్రదించేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా వైద్య సేవలు అంతగా లేని ప్రాంతాల్లో రోగులకు వైద్య సేవలు అందడంతో పాటు సులభతరంగా వైద్యుల సేవలను పొందవచ్చునని తెలిపారు. అదే సమయంలో వైద్యులను సంప్రదించకుండా మందులను వాడి ఇబ్బందులు పాలు కాకుండా నివారించవచ్చునని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని 50 ఫార్మసీలు ఆనంద ఈ క్లినిక్స్‌ను నెలకొల్పేందుకు తమతో ఒప్పందం కుదుర్చుకున్నాయని చెప్పారు. రాబోయే మూడేళ్లలో 1000 షాపులలో తమ సేవలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎండీ సురేష్, మార్కెటింగ్ హెడ్ సతీష్, తెలుగు రాష్ట్రాల ఇన్చార్జులు ధనరాజ్, రాహుల్, సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.