Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎప్పటికప్పుడు తరలించకపోతే రోగాలు వ్యాప్తి చెందే అవకాశం
- బండ్లగూడ -మన్సూరాబాద్ దారిలో రోడ్డుపై పేరుకుపోయిన చెత్త
తరలించాలని కాలనీవాసుల విజ్ఞప్తి
- చెత్తను వాహనాల్లోనే వేయాలంటున్న జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది
నవతెలంగాణ-నాగోల్
అసలే వర్షాలు పడుతున్నాయి. ఆపై చెత్త కుప్పలుగా పేరుకు పోతే ఎట్లుంటదో చెప్పాల్సిన అవసరంలేదు. కుప్పలుగా పేరుకుపోయిన చెత్తవల్ల దుర్వాతన వెదజల్లుతోందని, రోగాలు ప్రబలే అవకాశం లేకపోలేదని నాగోలు డివిజన్ పరిధిలోని పలు కాలనీల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బండ్లగూడ నుండి మన్సురాబాద్ వెళ్లే దారిలో భువనిక (భూ వైనిక) శిక్షణా సంస్థ సమీపంలో రోడ్డుపక్కన చెత్త పేరుకుపోయింది. చుట్టుపక్కల ఉన్న కాలనీలవారు రోజూ చెత్తను ఇక్కడే వేయడం, వెనువెంటనే జీహెచ్ఎంసీ శానిటరీ విభాగం సిబ్బంది తరలించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీనివల్ల ఈరూట్లో వెళ్లడానికే పాదచారులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇండ్లల్లో ఉన్న చెత్తతో పాటు పాడైపొయిన కారగాయలు, ఇతర వ్యర్ధ పదార్ధాలను, వేడుకలలో మిగిలిపొయిన ఆహార పదార్థాలను సైతం చెత్తకుప్పల్లో వేస్తుండటంతో ఇక్కడ పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చెత్తకుప్పల్ని చెల్లా చెదురు చేస్తున్నాయి. అదే విధంగా బీకే రెడ్డి కాలనీలో కూడా ఒక ఖాళీ ప్లాట్లో అర్ధరాత్రి వేళలో చెత్త వేస్తుంటారని, అది పేరుకుపోయి దుర్వాసన వస్తోందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ వేయకూడదన్నా కాలనీవాసులు పట్టించుకోవడం లేదని కొందరు చెప్తున్నారు. ఇదిలా ఉండగా నాగోల్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు ఆనుకొని ఉన్న స్థలంలో రోజూ చెత్త వేస్తుండటంతో అక్కడ చెత్త డంపులా మారింది. దీనివల్ల స్టూడెంట్లు, టీచర్లు ఇబ్బందిపడుతున్నారు. తమ పిల్లలు రోగాలబారిన పడే అవకాశం ఉందని పేరెంట్స్ వాపోతున్నారు. పారిశుధ్య సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడి నుంచి చెత్తను తరలించడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పేరుకుపోతున్న చెత్త మురిగి దుర్వాసన వస్తోందని చెప్తున్నారు. పన్ను వసూళ్లపై పెట్టిన ధ్యాస, చెత్తను తరలించే విషయంలో కూడా జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది పెట్టాలని చుట్టుపక్కలవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త పేరుకుపోవడంతో సీజనల్ వ్యాధులు, మలేరియా, డెంగ్యూ, కలరా వంటివి వచ్చే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్తను వెంటనే తరలించాలని, అవసరమైనచోట చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కాలనీవాసులు కూడా చెత్తను రోడ్లపై, చెత్త కుప్పల్లో వేయకుండా కాలనీల్లోకి వచ్చే చెత్త వాహనాల్లో వేయాలని జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది సూచిస్తున్నారు. ఏది ఏమైనా వర్షాల నేపథ్యంలో చెత్త పేరుకుపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.