Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్
ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్‌పై అవాక్కులు చవాకులు పేలడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని బీజేవైఎం జిల్లా నేత వినరు కుమార్ విమర్శించారు. సోమవారం గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముషీరాబాద్‌లో ముఠా గోపాల్ చేతిలో ఓడిపోయి ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకొని వేరే రాష్ట్రం నుంచి రాజ్య సభకు ఎన్నికైనారు అని ఆరోపించిన కేసీఆర్, నిజామాబాదులో ధర్మపురి అరవింద్ చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న కూతురు కవితను దొడ్డి దారిన ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం గురవింద గింజ తన నలుపెరుగదని నిరూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ ఇన్చార్జిగా వ్యవహరించిన కల్వకుంట్ల కవిత వారం రోజులు పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించినా కూడా ఇక్కడ ప్రజలు తిరస్కరించారని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన ఓబీసీ నాయకుడు పార్టీకి అంకితభావంతో అనేక సంవత్సరాలు చేసిన సేవను గుర్తించి బీజేపీ అధిష్టానం ఉత్తర్‌ప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేస్తే కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కండ్లల్లో నిప్పులు పోసుకొని అగ్రవర్ణ దురహంకారంతో వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని అన్నారు. డాక్టర్ లక్ష్మణ్‌పై స్థాయి మరచి చేసిన విమర్శలకు ప్రజలు తగిన బుద్ది చెప్పడానికి సన్నద్ధమయ్యారని హెచ్చరించారు. త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికల్లో డాక్టర్ లక్ష్మణ్ నాయకత్వంలో టీఆర్ఎస్ను మట్టికరిపించి ముషీరాబాద్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.