Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్నపాటి వానకే ఇండ్లల్లోకి చేరుతున్న మురుగునీరు
- ముషీరాబాద్‌కు పొంచిఉన్న రోగాల ముప్పు
నవతెలంగాణ-అడిక్‌మెట్
ముషీరాబాద్పరిధిలోని పలు కాలనీల్లో మురుగు కాల్వలు ఇండ్ల మధ్య నుంచి ఉండటంతో, తరచూ డ్రయినేజీలు పొంగి పొర్లుతుండటంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి వానకే కాల్వలు నిండి ఇండ్లముందుకు పలుచోట్ల ఇండ్లల్లోకి మురుగునీరు చేరుతుండటంతో రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల నాలాల్లో చెతాచెదారం పేరుకుపోయింది. రోడ్లపై చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. కుక్కలు పందులు స్వైర విహారం చేస్తున్నాయి. దోమలు పెరిగిపోతున్నాయి. ఓవైపు సీజనల్ వ్యాధులు, మరోవైపు కరోనా ప్రమాదం పొంచిఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్, పద్మా కాలనీ, నాగమయ్యకుంట, దీన దయాల్ నగర్ తదితర బస్తీల ప్రజలు వర్షాల నేపథ్యలో బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. గత సంవత్సరం కూడా భారీ వర్షాలకు ఇక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేలికపాటి వర్షానికి కూడా నీరు ఇండలోకి చేరుతోంది. నాలాలు పొంగి ప్రవహించకుండా ఎట్టి పరిస్థితిలో గతంలో మాదిరిగా జరగకూడదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అత్యధిక నిధులు కేటాయించి నాలా విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. పూడికతీత పనులు చేపట్టారు. అయినా అధికారుల, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో పలుచోట్ల పనులు కూడా పూర్తికాలేదు. నాలా విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే పలుమార్లు పర్యటించి ఆదేశించిన పనుల్లో పురోగతి కనిపించడం లేదు. ఇప్పటికైనా త్వరగా పనులు పూర్తయ్యేలా చూసి తమ ఇబ్బందులను తొలగించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.